యాసంగి ధాన్యం కొనాల్సిందే..
` సభ నుంచి తెలంగాణ ఎంపీల వాకౌట్
` ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలి
` తెలంగాణలో పెరిగిన ధాన్యం ఉత్పత్తి
` ఏడాదికి ఎంత కొంటారో పాలసీ ప్రకటించాలి
` లోక్‌సభలో ప్రస్తావించిన టిఆర్‌ఎస్ నేత నామా
న్యూఢల్లీి,డిసెంబరు 3(జనంసాక్షి):దిల్లీ: తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెరాస ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ధాన్యం కొనుగోలుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెరాస సభ్యులు సభనుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభలో తెరాస పక్షనేత కె.కేశవరావు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ వద్ద తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరారవు విూడియాతో మాట్లాడుతూ… ధాన్యం కొనుగోలుపై పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేయాలని డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. గత ఐదురోజుల నుంచి తెరాస ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలని పదే పదే కోరినా పట్టించుకోలేదన్నారు. ‘‘దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు విధానం ప్రవేశ పెట్టాలని, తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి లేదు. మోదీ ప్రభుత్వం పేదల, రైతు, కార్మిక వ్యతిరేక ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది’’ అని నామా ఆరోపించారు.కాగా వరి కొనుగోలుపై ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు లోక్‌సభ దృష్టికి తీసుకుని వచ్చారు. అత్యవసర అంశాలకు కేటాయించిన సమయంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాల గురించి ఈ సందర్భంగా వివరించారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంటు ఇచ్చామని, రైతుబంధు ఎకరానికి 10వేలు ఇవ్వడం.. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతాంగానికి నీళ్లు అందాయన్నారు. దీంతో ఎక్కువ శాతం పంట దిగుబడి పెరిగిందని నామా తెలిపారు. వరి ఉత్పత్తిలో ఇండియాలో నెంబర్ వన్ అయ్యామన్నారు. దాని వల్ల వరి సేకరణ సమస్య ఏర్పడిరద న్నారు. తెలంగాణలో ఏడాదికి రెండుసార్లు పంట వేస్తారన్నారు. ధాన్యం ప్రొక్యూర్మెంట్ కోసం కేంద్రంతో మాట్లాడామని, ఒకసారి తీసుకుంటాం, మరోసారి తీసుకోమని కేంద్రం అంటోందని నామా ఆరోపించారు. ఎఫ్‌సీఐకి కోటా ఇవ్వడంలేదన్నారు. తెలంగాణ రైతులు రోడ్డువిూదపడ్డారని, ధాన్యం సేకరణ గురించి ఆరు సార్లు విూటింగ్ జరిగిందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు పలుసార్లు కేంద్రంతో చర్చలు జరిపారన్నారు. ఏడాదికి ఎంత వరిని ప్రొక్యూర్ చేస్తారని నామా అడిగారు. దీంట్లో కోటా కేటాయిస్తే, ఆ విషయాన్ని రైతులకు చెబుతామన్నారు. ఏడాదికి ఎంత కోటా తీసుకుంటారో చెప్పాలని కేంద్రాన్ని కోరారు. దక్షిణ భారత దేశంలో వేడి వాతావరణం వల్ల వరి ముక్కలు అవుతుందని, దాని వల్ల బాయిల్డ్ రైస్‌ను ఫ్రిపర్ చేయాల్సి వస్తుందన్నారు. రైతులు క్షేమంగా ఉంటేనే దేశం క్షేమంగా ఉంటుందని, కరోనా సమయంలో తిండి పెట్టింది రైతులే అని ఆయన అన్నారు. కేవలం తెలంగాణ మాత్రమే కాదు, దేశం రైతాంగం కోసం జాతీయ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని తీసుకురావాలని నామా డిమాండ్ చేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత తీసుకురావాలని కోరారు.
బాయిల్డ్ రైస్ ఎంత ప్రొక్యూర్ చేస్తారో చెప్పండి :ఎంపీ కేశవరావు
తెలంగాణలో ధాన్యం సేకరణపై ఇవాళ రాజ్యసభలో ప్రశ్న వేశారు. ఎంపీ కేశవరావు దీనిపై మాట్లాడారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయడంలేదని, చాలా సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, తెలంగాణ నుంచి మొత్తం ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందా లేదా అని కేశవరావు ప్రశ్నించారు. అది ఎటువంటి ధాన్యమైనా సేకరించాలన్నారు. తెలంగాణ నుంచి ప్రతి గింజను కొంటామని ఓ కేంద్ర మంత్రి చెప్పారని, ఆ ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందా లేదా అని ఆయన అడిగారు. గత ఏడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొన్నదని, కానీ ఈ ఏడాది కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు కేశవరావు అన్నారు. గత ఏడాది తీసుకున్నంత ఈ ఏడాది తీసుకుంటారా అని కేంద్రాన్ని కేశవరావు అడిగారు. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం 60 శాతం పెరిగిందన్నారు.దీనిపై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీశాఖ మంత్రి పీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. ప్రతి ఏడాది పంట సేకరణను క్రమంగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ధాన్య సేకరణను పెంచామని, తెలంగాణలోనూ ప్రొక్యూర్మెంట్‌ను పెంచినట్లు ఆయన వెల్లడిరచారు. తెలంగాణలో ఖరీఫ్ సీజన్‌లో 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పారని, కానీ కేవలం 32.66 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చారన్నారు. రబీ సీజన్‌లో ఎక్కువగా బాయిల్డ్ రైస్ ఉంటుందని, ఒకవేళ విూరు బాయిల్డ్ రైస్ ప్రొక్యూర్ చేస్తే, ఎంత చేస్తారో చెప్పాలని కేశవరావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. పెండిరగ్‌లో ఉన్న ధాన్యాన్ని సరఫరా చేయాలని మంత్రి గోయల్ అన్నారు.టీఆర్‌ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి కూడా మాట్లాడారు. రబీలో పారాబాయిల్డ్ రైస్ మాత్రమే ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని, ఆ రైస్‌ను కొంటారా కొనరా అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు. తెలంగాణలో పండిన పంట అంశంపై కేంద్రానికి డౌట్ ఉందని, కానీ ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా 99 శాతం ఆ డౌట్ క్లియరైందన్నారు. రబీ పంట కోసం తెలంగాణలో నాట్లు వేయడం మొదలయ్యాయని, కానీ ఆ రైస్ కొంటారా లేదా అన్న అంశాన్ని మార్చిలో చెబుతామని కేంద్ర మంత్రి చెప్పడం శోచనీయంగా ఉందన్నారు. రబీలో పండే పారాబాయిల్డ్ రైస్‌ను ప్రొక్యూర్ చేస్తారా లేదా చెప్పాలని సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు.ఒడిశాకు చెందిన ఎంపీ సుస్మిత్ పాత్ర కూడా దీనిపై మాట్లాడారు. పారాబాయిల్డ్ రైస్‌ను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొంటుందా కొనదా అని ఆయన అడిగారు. ఎందుకుంటే ఒడిశాలో కూడా ఎక్కువ శాతం పారాబాయిల్డ్ రైస్‌ను ఉత్పత్తి చేస్తారన్నారు. ఎఫ్‌సీఐ ఆ ధాన్యాన్ని కొనేలా చేయాలన్నారు.