యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు: మంత్రి విజయభాస్కర్‌

చెన్నై,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): తుపాను బాధిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

చేపడుతున్నట్టు తమిళనాడు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్‌ తెలిపారు. కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి జిల్లాల్లో అంటురోగాల వ్యాప్తి నిరోధకానికి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలు అందించడం కోసం కన్యాకుమారి జిల్లాకు సంచార వైద్యబృందాలు పంపినట్టు పేర్కొన్నారు. మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించి యుద్ధప్రాతిపది కన సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు.

ఓఖి తుపాను ధాటికి కన్యాకుమారి జిల్లా నుంచి చేపలు పట్టేందుకు వెళ్లిన సుమారు 400 మంది జాలర్లు గల్లంతైనట్టు చెబుతున్నారని, అందుకు సంబంధించి సరైన వివరాలు లభించలేదని పేర్కొన్నారు. తమ లెక్క ప్రకారం 100 మంది జాలర్లు గల్లంతై ఉండొచ్చన్నారు. వారంతా లక్షద్వీపం ప్రాంతంలో ఉండొచ్చని భావిస్తున్నామని, వారిని రక్షించడానికి నావికా, తీరరక్షణ, వైమానిక తదితర దళాలు రంగంలోకి దిగాయని తెలిపారు. కన్యాకుమారి, నాగర్‌కోవిల్‌ ప్రాంతాల్లో కూలిపోయిన 4 వేల విద్యుత్తు స్తంభాలను పునరుద్ధరించే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని వెల్లడించారు. దీని కోసం ఇతర జిల్లాల నుంచి 2500 మంది విద్యున్మండలి సిబ్బందిని పంపినట్టు పేర్కొన్నారు. కన్యాకుమారి జిల్లాలో పలు చెట్లు కూలిపోయాయని, మెయిన్‌ రోడ్డులో కూలిపోయిన సుమారు 300 వృక్షాలను తొలగించారని తెలిపారు. నీరు ఇంకిన తర్వాత వర్ష నష్టం గురించి అంచనాల పనులు ప్రారంభించనున్నారని చెప్పారు. ఇళ్లు కోల్పోయినవారు, పంట దెబ్బతిన్న రైతులకు తగిన పరిహారం అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నారని పేర్కొన్నారు. ఇదిలావుంటే తుపాను హెచ్చరికలు నేపథ్యంలో చెన్నైలో ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్టు రెవెన్యూ పరిపాలన కమిషనరు సత్యగోపాల్‌ తెలిపారు. బంగాళాఖాతంలో కన్యాకుమారికి సవిూపంలో ఏర్పడిన ఓఖి తుపాను వెళ్లిపోయినప్పటికీ 4, 6వ తేదీల్లో మరొక తుపానుకు అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. చెన్నై తదితర ఉత్తరాది జిల్లాల్లో భారీవర్షాలకు అవకాశం ఉన్నట్టు వాతావరణ పరిశోధన కేంద్రం హెచ్చరించడంతో అప్రమత్తమయ్యామని తెలిపారు. భారీవర్షాల కారణంగా చెరువులు, కుంటలు తదితర జల వనరులు నిండే అవకాశాలు ఉండటంతో వాటిపై దృష్టి సారించామని పేర్కొన్నారు. నగర శివారులోని మదురాంతకం చెరువు గతంలో నిండటంతో దాని సవిూపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇదే తరహాలో ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. అన్ని జలవనరులను ప్రజా పనులశాఖ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారని, నిండి అదనపు నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించినట్టు తెలిపారు.