యుద్ధ వీరులకు మోదీ ఘన నివాళి

2

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌22(జనంసాక్షి):

దిల్లీలోని అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద అమరవీరులకు ప్రధాని నరేంద్రమోదీ నివాళులర్పించారు. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య 1965లో జరిగిన యుద్ధంలో అమరులైన జవానులకు ప్రధాని మోదీ అంజలి ఘటించారు. ఈ సందర్భంగా సైనికుల సేవలను కొనియాడారు. సైనికుల త్యాగాల వల్లే మనం ఈ స్థితిలో ఉన్నామని అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద సందర్శకుల పుస్తకంలో ప్రధాని పేర్కొన్నారు. యుద్ధ వీరులకు నివాళిగా వైమానిక దళ హెలిక్టాపర్లు పూల వర్షం కురిపించాయి. కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌, సైనిక దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదిలావుంటే పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్న భారత మాజీ సైనికులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తేనీటి విందును ఏర్పాటుచేశారు. 1965లో పాకిస్థాన్‌తో యుద్ధంలో విజయం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక ఆడిటోరియంలో మాజీ సైనికులు, వారి కుటుంబసభ్యులను ప్రణబ్‌ ముఖర్జీ కలుసుకున్నారు. ఈ విందుకు భారత రక్షణశాఖ మంత్రి మనోహార్‌ పారికర్‌, మాజీ ప్రధాని మన్మోహాన్‌ సింగ్‌తో పాటు త్రివిధ దళాధిపతులు, మాజీ సైనికులు వారి కుటుంబసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.