యువకుడి దారుణ హత్య
కరీంనగర్,మార్చి31(జనంసాక్షి): జిల్లాలో తెల్లవారే సరికి హత్యలు, మానభంగాలు, అకృత్యాలు, దోపిడి సంఘటనలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉన్నామని, ఎలాంటి విద్రోహాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నామని బల్లగుద్ది వాదిస్తున్నదంతా అబద్దమని తేలిపోతోంది. గత నెల రెండు నెలలుగా ఈ దుస్సంఘటనలు యధేచ్చగా జరగుతున్నాయి. అయితే ఈసంఘటనలతో జిల్లా వాసులు తీవ్ర అందోళనకు గురవుతున్నారు. మొన్న రాయికల్ మండలంలో రైతును దారుణంగా గొంతుకోసి హత్య చేసిన సంఘటన, నిన్న కరీంనగర్ పట్టణంలోని శివారు ప్రాంతంలో ఓ ఫంక్షన్‌హాలు సవిూపంలో వివాహితపై దాడి చేసి మెడ నరికి మరీ 15 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెల్లిన సంఘటన ఇంకా ఇలాంటివి ప్రతి రోజు తీవ్ర సంచలనం కలిగిస్తున్న దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా గురువారం ఉదయం జిల్లాలోని గొల్లపల్లి మండలం గుంజపడుగులో యువకుడిని దారుణంగా పొడిచి చంపిన సంఘటన వెలుగు చూసింది. ఈహత్య గ్రామంలోనే కాక, మండలంలో జగిత్యాల డివిజన్‌లో తీవ్ర సంచలనం కలిగించింది. గ్రామస్థులు గుర్తుతెలియని వ్యక్తి శవాన్ని చూసి బెదిరిపోయి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి శవపంచనామా చేసి పోస్టు మార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ యువకుడిది పెంబట్ల గ్రామంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా వరుస హత్యలు చోటు చేసుకుంటుండడంతో జగిత్యాల సబ్‌డివిజన్ పరిధిలో హత్యల పరంపరను ఆపేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం అవుతుంది.
ఇప్పటికైనా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి హత్యలు, దోపిడీలు, ఇతరత్రా సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.