యువకున్ని సింహం నుండి కాపాడిన జూ సిబ్బంది
ఇండోర్: సింహం ఆవరణలోకి దూసుకెళ్ళి ప్రాణాపాయంలో చిక్కుకున్న ఓ 18 ఏళ్ళ టీనేజీ బాలున్ని జూ సిబ్బంది కాపాడిన సంఘటన ఇండోర్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం కమలా నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో రాహుల్ బినోదియా 8 అడుగుల ఎత్తు నుంచి సింహాలు ఉంటున్న ప్రదేశంలోని బఫర్ జోన్‌లోకి దూకాడు. అక్కడి నుంచి 18 అడుగుల లోతు గల కందకం దాటి డబుల్ మెష్ ప్రొటెక్టివ్ జోన్ దాటి ప్రధాన ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు.
దీన్ని గమనించిన జూ గార్డులు, గార్డెనర్లు, ఫోటోగ్రాఫర్లు, సందర్శకులు సమయానికి అతన్ని పట్టుకోవడంలో సఫలమయ్యారు. సందర్శకులు అతన్ని చితకబాది తర్వాత పోలీసులకు అప్పగించారు. అతనిపై సెక్షన్ 309 కింద ఆత్మహత్యకు ప్రయత్నించాడనే ఆరోపణలతో కేసు ఫైలు చేశారు. అతను ఆ సమయంలో చిత్తుగా తాగి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది.
ఎన్‌క్లోజర్‌లో ఆకాశ్, మేఘ అను పేర్లు గల సింహాల జంట నివసిస్తోందని, ఇక్కడ ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారని జూ ఇన్‌చార్జ్ ఉత్తమ్ యాదవ్ చెప్పారు. గత ఏడాది ఇండోర్‌కే చెందిన కౌశిక్ మధ్యం సేవించి గ్వాలియర్ జూలో అర్ధ నగ్నంగా సింహాల జంట ముందు హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే.