యువత చేతిలోనే తెలంగాణ భవిష్యత్
మరోమారు టిఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలి
ప్రచారంలో సోమారపు సత్యనారాయణ పిలుపు
రామగుండం,నవంబర్27(జనంసాక్షి): ఈ ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించబోతున్నారని, వారే ఫలితాలను ప్రభావితం చేయబోతున్నారని రామగుండం టిఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ అన్నారు. యువత ఆలోచించి టిఆర్‌ఎస్కు ఓటేసి తెలంగాణ అభివృద్దికి అండగా నిలవాలన్నారు. రామగుండం నియోజకవర్గంలో కొంతమంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సింగరేణి, రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం తాను చిత్తశుద్ధితో పనిచేశాననీ, భవిష్యత్తులోనూ పనిచేస్తానని
చెప్పారు. రామగుండం కార్పొరేషన్‌కు ఇప్పటికే రూ.300 కోట్లను కేసీఆర్ మంజూరు చేసారని, ఆ నిధులతో పనులు కొనసాగుతున్నాయన్నారు. అబద్దాలతో అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్నవారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఒక్కటైన మహాకూటమి నాయకుల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం పని చేస్తున్న
టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్న కాంక్షతోనే, పార్టీలకతీతంగా నాయకులు, యువకులు, మహిళలు గులాబీ గూటికి భారీగా చేరుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేస్తేనే సింగరేణి సంస్థ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని ఉద్ఘాటించారు. గడిచిన నాలుగు సంవత్సరాల్లో సింగరేణి సంస్థను అనేక విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సింగరేణిలో తండ్రి, కొడుకుల ఉద్యోగాలు అమలవుతాయని ఎవరూ ఊహించలేదని, ఇప్పుడు అది అమలు కావడంతో ప్రతిపక్షాలకు నోటమాట రావడం లేదన్నారు. కారుణ్య నియమాకాలకు తోడుగా లాభాల్లో 27శాతం వాటా, తెలంగాణ ఇంక్రిమెంట్, సొంతింటి కలను సాకారం చేయడానికి రూ.10లక్షల రుణంపై వడ్డీ మాఫీ చేసిన ఘనత కేవలం టీఆర్‌ఎస్‌కే దక్కిందన్నారు. కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం కల్పించడం, విద్యుత్ చార్జీలు రద్దు చేయడం లాంటి ఎన్నో ప్రయోజనకరమైన పనులు చేశామని వివరించారు.




