”యువత మానవ హక్కుల పై అవగాహన పెంచుకోవాలి”
బొల్లారం, సెప్టెంబర్ 26, (జనంసాక్షి):
”యువత మానవ హక్కుల పై అవగాహన పెంచుకోవాలి”
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడుస్తున్నా..గెలిచిన ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం విద్యా విధానాలలో ఎన్నొ మార్పులు తీసుకువస్తున్నా కూడా మానవ హక్కుల గూర్చిన ప్రస్తావన విద్యార్ధుల పాఠ్యాంశాలలో లేకపోవడం అనేది మన పాలకుల భాద్యతా లొపమనే చెప్పాలి. ప్రతి మనిషి ఈ భూమిపై జన్మిస్తూనే తనకు సంక్రమించే జన్మహక్కులే మానవ హక్కులు. అవి ఏంటంటే ప్రతి మనిషికి –
స్వేచ్ఛ మరియు భద్రత హక్కు, ఆలోచనా స్వేచ్ఛ హక్కు, సమానమైన ప్రవేశ హక్కు, వివక్ష నుండి రక్షణ హక్కు, సమాన పనికి సమాన వేతనం హక్కు స్వేచ్ఛగా పుట్టే హక్కు మరియు జీవించే హక్కుల్లాంటివి మనకున్నాయని ఎంత మందికి తెలుసు? అని అంతర్జాతీయ మానవ హక్కుల కమీషన్ తెలంగాణ స్టేట్ బోర్డు యూత్ సెక్రటరీ సంకు విజయ్ కుమార్ యువతను ప్రశ్నించారు. నేడు స్థానిక బొల్లారం లో ఏర్పాటు చేసిన మానవ హక్కుల అవగాహన సదస్సుకు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ…
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1948లోఐక్యరాజ్యసమితి అసెంబ్లీ తీర్మానించి, ఆమోదించిన మానవ హక్కులను కేవలం పౌరుల ప్రాధమిక హక్కులుగా మాత్రమే చూపిస్తూ భ్రమకలిగిస్తూ వస్తున్నారు. మానవ హక్కుల గురించి విశ్వవిఖ్యాత డా.బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూర్తిగా తెలుసును గనుకే మన రాజ్యాంగంలో ఆ హక్కులను ప్రతి మనిషికి ఉపయోగపడేలాగా పొందుపరిచారు. నేడు మన దేశంలో అనేక చోట్ల అమాయక ప్రజలపై వివక్షతో దాడులు చేయడం మనం చూస్తున్నాం ఈ దాడులు మానవహక్కుల ఉల్లంఘనే అవుతుంది. అందుచేత యువత తప్పకుండా సామాజిక అంశాలతో పాటు మానవ హక్కుల గురించిన అవగాహన పెంచుకోకపోతే రాబోయే తరాలవారికి పాలకుల మరియు పెత్తందారుల దొపిడిని గూర్చిన జ్ఞానం అందించలేరు అని అన్నారు. సమావేశంలో స్టేట్ సెక్రట్రీ శ్రీనివాస్, కమీషన్ మెంబర్స్ కత్తి సైమన్ రాజ్, ఓదూరి ఆనంద్,దామెర నవీన్,భాను,సంకు రమేష్ మరియు డివిజన్ కు చెందిన యువకులు పాల్గొన్నారు.