యువత స్వయం సమృద్ధితోనే దేశాభివృద్ధి – ప్రధాని మోదీ
దిల్లీ,జనవరి 24(జనంసాక్షి): ‘ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తితో ‘వోకల్ ఫర్ లోకల్’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కళాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మోదీ ఈ మేరకు వెల్లడించారు. ”ప్రజలు తాము నిత్య జీవితంలో స్వదేశీ ఉత్పత్తుల ఉపయోగంపై దృష్టి సారించాలి. అదే సమయంలో తమ జీవితాల్లోకి విదేశీ వస్తువులు ఎంత మేర వచ్చాయోనన్న విషయాన్ని పరిశీలించుకోవాలి. ఆయా వస్తువులకు మానసికంగా బానిసలవుతున్నామనే విషయాన్ని మనం గుర్తించాలి. యువత తలచుకుంటే భారత్ సులువుగా స్వశక్తి ఆధారిత దేశంగా మారుతుంది. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విజయం కూడా దేశ యువతపైనే ఆధారపడి ఉంది” అని మోదీ అన్నారు. ”దేశంలోని శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఎంతో శ్రమించి కరోనా వైరస్‌కు టీకాను రూపొందించి తమ కర్తవ్యాన్ని పూర్తి చేశారు. ఆ టీకాను వేయించుకొని ప్రజలు తమ బాధ్యతను నిర్వర్తించాలి. తప్పుడు ప్రచారాల్ని వ్యాప్తి చేసే వారిని మనం సరైన సమాచారంతో ఓడించాలి. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం అయ్యేందుకు అందరూ ముందుకు వచ్చి సహకరించాలి. దేశ అభివృద్ధి కోసం ఉన్నతంగా శ్రమించాలి” అని మోదీ విజ్ఞప్తి చేశారు. స్థానిక ఆర్థిక వ్యవస్థల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వోకల్ ఫర్ లోకల్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఆత్మనిర్భర్ భారత్‌లో యూపీ పాత్ర కీలకం
ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో ఉత్తరప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన ఈమేరకు ట్వీటర్ ద్వారా వెల్లడించారు. ‘ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేల సంస్కృతి, సంప్రదాయాలకు నిలయం. ఈ రోజు ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తోంది’ అని వెల్లడించారు.