యువరక్తం నింపుతా.. జవసత్వాలు తెస్తా : రాహుల్‌

ఉపాధ్యక్షుడి బాధ్యతలు స్వీకరణ
న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి):
యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బుధవారంనాడు ఆయన ఏఐసిసి కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన పలువురు సీనియర్‌ నేతలు హాజరయ్యారు. రాహుల్‌ గాంధీకి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు హోదాలో ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. దేశానికి యువశక్తి అవసరం ఎంతో ఉందని అన్నారు. యువతరానికి దేశరాజకీయాలను మార్చే శక్తి ఉందన్నారు. అందుకే వారిని రాజకీయాల్లోకి రావాలనే ప్రోత్సహిస్తున్నా మని అన్నారు. మంచి రాజకీయాలే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించగలవని రాహుల్‌ అన్నారు. రాజకీయాల్లో మార్పునకు కాంగ్రెస్‌ పార్టీ సరైన వేదికన్నారు. యువత, అనుభవజ్ఞులైన సీనియర్‌ నేతల సమ్మిళితంతో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అన్నారు. దేశానికి దశ, దిశ నిర్ధేశించగలిగింది కాంగ్రెస్‌ పార్టీయేనని అన్నారు. మీడియా సమావేశంలో రాహుల్‌ నవ్వులతో అలరించారు.