యూకేలో కరోనా కల్లోలం

` ఒమిక్రాన్‌తో తొలి మరణం నమోదు
` బ్రిటన్‌లో మృతి చెందిన మహమ్మారి బాధితుడు
` అధికారికంగా ధ్రువీకరించిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌
` వెంటనే బూస్టర్‌ డోసు వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
లండన్‌,డిసెంబరు 13(జనంసాక్షి):ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌తో తొలి మరణం నమోదైంది. యూకేలో వేరియంట్‌ సోకినవారిలో ఓ వ్యక్తి మృతిచెందినట్టు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ధ్రువీకరించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ భారీ అలలా ముంచుకొస్తోందంటూ ప్రధానమంత్రి హెచ్చరిక చేసిన కొన్ని గంటల్లోనే ఈ వేరియంట్‌తో తొలి మరణం చోటుచేసుకోవడం గమనార్హం. మరోవైపు, ఒమిక్రాన్‌ యూకేలో కార్చిచ్చులా వ్యాపిస్తుండటంతో బూస్టర్‌ డోసు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తోన్న ఒమిక్రాన్‌ కేసులతో బ్రిటన్‌ వణికిపోతోంది. ప్రతి రెండు మూడు రోజులకు అక్కడ కొత్త వేరియంట్‌ కేసులు రెట్టింపవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే యూకేలో 1239 ఒమిక్రాన్‌ కేసులు రావడం యూకేలో ఈ వేరియంట్‌ ఉద్ధృతికి నిదర్శనం. యూకేలో దాదాపు 3100కు పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. యూకేలో నవంబర్‌ 27న ఒమిక్రాన్‌ కేసు తొలిసారి వెలుగుచూసింది. దీంతో బోరిస్‌ జాన్సన్‌ పలు కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. అలాగే, ఆదివారం ఆయన ఈ వేరియంట్‌ సోకకుండా రక్షణ కొరకు బూస్టర్‌ డోసు వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో బూస్టర్‌ డోసు కోసం వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. పశ్చిమ లండన్‌లోని పెడ్డింగ్టన్‌ సమీపంలో ఓ వ్యాక్సినేషన్‌ క్లీనిక్‌ని సందర్శించిన సందర్భంగా బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు ఒమిక్రాన్‌ కారణంగా ఆస్పత్రిలో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోందన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసి ఉదాసీనతతో ఉండొద్దని హెచ్చరించారు.