యూకే కొత్త వీసాలు..
– భారతీయ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు లబ్ధి
లండన్, జులై7(జనం సాక్షి) : శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం యూకే కొత్త వీసాలను ప్రవేశపెట్టింది. వీటితో భారతీయ శాస్త్రవేత్తలు కూడా లాభపడనున్నారు. పరిశోధన రంగంలో తమ దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు యూకే శాస్త్రవేత్తలు, పరిశోధకుల కోసం ఈ వీసాలను ప్రవేశపెట్టింది. యూకేఆర్‌ఐ సైన్స్, రీసెర్చ్, అకడమియా పేరుతో సరికొత్త వీసా విధానాన్ని ప్రారంభించింది. టైర్ 5(తాత్కాలిక ఉద్యోగ ప్రభుత్వ అధికారిక ఎక్స్ఛేంజ్) వీసాతో పాటు అదనంగా ఈ విధానం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వీసాతో యూరోపియన్ యూనియన్ వెలుపలి దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు రెండేళ్ల పాటు యూకేలో ఉండొచ్చు. పరిశోధన, ఆవిష్కరణ రంగంలో యూకే అంతర్జాతీయంగా అగ్రగామి. ఇప్పుడు ప్రవేశపెట్టిన కొత్త వీసాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు యూకేలో పనిచేయడానికి, శిక్షణ పొందడానికి సులువు అవుతందని యూకే ఇమ్మిగ్రేషన్ మంత్రి కరోలినే నోక్స్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఆకర్షించేందుకు తప్పకుండా యూకేకు మంచి వలసవిధానం ఉండాలని, దాని వల్ల నిపుణుల మేధస్సు తమ దేశానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో నిపుణుల సహకారం ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి ఎంతో కీలకమని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను తమ దేశం ఆహ్వానిస్తూనే ఉంటుందని తెలిపారు. తాజాగా ప్రవేశపెట్టిన వీసాలను యూకే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్(యూకేఆర్‌ఐ) నిర్వహిస్తుందని తెలిపారు. యూకేఆర్‌ఐ కింద ఆమోదం పొందిన 12 రీసెర్చ్ సంస్థలు ఉన్నాయి. ఈ వీసాల ద్వారా ప్రతిభావంతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులను ఇప్పుడు నేరుగా యూకేలో పనిచేసుకోవడానికి, శిక్షణ పొందడానికి స్పాన్సర్ చేయొచ్చు. ఈ స్పాన్సర్ సంస్థలను యూకేఆర్‌ఐ పర్యవేక్షిస్తుంది. అయితే వారికి టైర్ 5 స్పాన్సర్ లైసెన్స్ ఉండాలి.