యూనీఫామ్‌ అందచేతలో ఏటా నిర్లక్ష్యమే

స్థానికంగా దర్జీలకు అప్పగింతలో ఆలస్యం
కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో చదివే బాలలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నా ప్రస్తుత విద్యా సంవత్సరంలో మాత్రం ఉచిత యూనిఫామ్‌ దుస్తులు కొన్ని పాఠశాలలకు నేటికీ విద్యార్థులకు చేరలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మార్చితో విద్యా సంవత్సరం ముగుస్తున్నా దుస్తులు అందకపోవడం క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యాన్ని చూపుతోంది.రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల వస్త్రాలను పాఠశాలలకు  సరఫరా చేస్తున్నా పరిస్థితిలో మార్పురాలేదు.  ప్రధానోపాధ్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీలు సమన్వయంతో దుస్తులను కుట్టించాల్సి ఉండగా.. గతంలో మాదిరిగానే వాటిని కుట్టించి అందించేందుకు ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు మొగ్గుచూపుతున్నారు.  స్థానికంగా దర్జీలు ముందుకు రావడం లేదన్న సాకుతో గతంలో మాదిరిగానే వస్త్రాలను ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. కొందరు ప్రధానోపాధ్యాయులు మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపి స్థానిక దర్జీలతో నాణ్యతతో కొలతల ప్రకారం కుట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.  ప్రధానోపాధ్యాయులు, ఎంస్‌ఎంసీ కమిటీలు తమకెందుకు తలనొప్పి అని భావిస్తూ పాత విధానాలకు దారులు తెరుస్తున్నారు.     ఒక్కో విద్యార్థికి రెండు జతల దుస్తులకు సరిపడా వస్త్రాలను పాఠశాలలకు సరఫరా చేస్తూ, ఒక్కో జత కుట్టుకూలీ కోసం రూ.40 చొప్పున ఎస్‌ఎంసీ ఖాతాలో వేస్తున్నారు. వాస్తవానికి వీరికి గత జూన్‌లోనే  దుస్తులు అందించాల్సి ఉన్నా సకాలంలో రాలేదు. గతేడాది దుస్తులతో విద్యార్థులు సరిపుచ్చుకున్నా కుట్టులోని నాణ్యతలోపాలు, కుట్టించడంలో అధికారుల డొల్లతనంతో అవి చినిగిపోవడం, పొట్టిగా మారడం జరిగింది. ఇప్పటికే జిల్లాలోని 16 మండలాల్లోని 10 మండలాలకు పైగా టైలరింగ్‌ సొసైటీలకే టైలరింగ్‌ బాధ్యతలను అప్పగించారని తెలుస్తోంది. కొన్నేళ్లుగా నాసిరకంగా కుడుతున్న పలు ఏజెన్సీల వారు పాఠశాలలకు వారే స్వయంగా తీర్మాన పత్రాలను తయారు చేసుకొని వెళ్తూ ఏటా తామే కుడుతున్నామని వస్త్రాలను తమ వశం చేసుకుంటున్నారు. కొన్ని ఏజెన్సీల నిర్వాహకులు తమ పలుకుబడిని ఉపయోగిస్తూ, మరి కొందరు బంధుత్వం గల ఉపాధ్యాయుల పేర్లను వాడుతూ ఏకమొత్తంలో మండలంలోని పాఠశాలలన్నింట్లో దుస్తులను కుట్టేందుకు తీర్మానాలను తీసుకునేలా ఒత్తిళ్లు పెంచతున్నారు.