యూపీఏ సంగతి సరే .. ముందు మీరేం వెలగబెట్టారు

– ఆర్థిక వేత్తయుశ్వంత్‌ సిన్హా

న్యూఢిల్లీ, ,సెప్టెంబర్‌ 28,(జనంసాక్షి): ‘భారతదేశ ఆర్థిక వ్యవస్థను అరుణ్‌ జైట్లీ సర్వనాశనం చేశారు. ఇప్పుడు కూడా నేను మాట్లాడకపోతే దేశద్రోహినవుతా. భయంతో మాట్లాడలేక సతమతమవుతున్న చాలామంది బీజేపీ నేతల మనోభావాలను ప్రస్ఫుటించేలా నా మాటలు ఉంటాయి’ అంటూ బీజేపీ ముఖ్యనేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా ప్రధాని మోదీపై, ఆర్థిక మంత్రి జైట్లీపై ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో నిప్పులు కురిపించిన విషయం విధితమే. ఇదిలా ఉంటే తాజాగా తాను చేసిన వ్యాఖ్యలపై నేను చర్చకు సిద్ధమంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. దేశ ఆర్థిక పరిస్థితిపై నా వ్యాఖ్యలు సరైనవేనని, ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇటీవల నూతనంగా తీసుకొచ్చిన జీఎస్టీ విధానానికి తాను అనుకూలమే అన్న యశ్వంత్‌సిన్హా.. హడావిడిగా ఈ విధానాన్ని తీసుకురావటంపైనే తన అభ్యంతరమని చెప్పుకొచ్చారు. తాజాగా దేశ ఆర్థిక పరిస్థితి క్షీణించటానికి ఇదే ప్రధాన కారణంగా యశ్వంత్‌ అభివర్ణించారు. గత ప్రభుత్వాలను తిట్టింది చాలు.. 40 నెలలుగా విూరేం చేశారంటూ మోదీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. మన ప్రభుత్వానికి కూడా తగినంత సమయం దొరికినపుడు యూపీఏని తిట్టి ప్రయోజనం లేదు. ప్రజలు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ కల్పన చేయలేని ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారు అని యశ్వంత్‌ అన్నారు. మరో బీజేపీ సీనియర్‌ నేత శత్రజ్ఞు సిన్హా కూడా యశ్వంత్‌కు మద్దతుగా నిలిచారు. యశ్వంత్‌ తాజా వ్యాఖ్యలతో బీజేపీ శ్రేణుల్లో మళ్లీ కలవరం మొదలైంది. దేశంలో ఎదురులేకుండా దూసుకెళ్తున్న మోడీ మానియాపై సొంతగూటికి చెందిన సీనియర్‌ నేతల వ్యాఖ్యలతో ఎలాంటి ప్రభావం చూపుతుందోనని బీజేపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

యశ్వంత్‌ సిన్హాకు తనయుడి కౌంటర్‌..

మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలను బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా తీవ్రంగా తప్పుబడుతుంటే.. ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్‌ సిన్హా మాత్రం ప్రభుత్వ ఆర్థిక విధానాలను వెనకేసుకొచ్చారు. మోదీ ప్రభుత్వం కొత్త ఆర్థిక విధానాన్ని సృష్టించిందని, ఇది దీర్ఘకాల వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు, న్యూ ఇండియా సృష్టికి దారి తీస్తుందని జయంత్‌ అన్నారు. తండ్రి ఆర్టికల్‌కు కౌంటర్‌గా జయంత్‌ సిన్హా గురువారం మరో పత్రికలో ఆర్టికల్‌ రాశారు. దేశ ప్రజలందరికీ మెరుగైన జీవితాలు అందించేలా కొత్త ఆర్థిక విధానాలు ఉన్నాయని ఇందులో జయంత్‌ కొనియాడారు. ఏవో కొన్ని విషయాలను పట్టుకొని ఈ సంస్కరణలను తప్పుబట్టడం సరికాదని పరోక్షంగా తన తండ్రికి కౌంటర్‌ ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలను ఒకటి లేదా రెండు తైమ్రాసికాల వృద్ధి చూసి అంచనా వేయడం సరి కాదని జయంత్‌ అన్నారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా జయంత్‌ సమర్థించారు.