యూపీలో బీజేపీకి షాక్..
` మరో మంత్రి ఔట్..
` ఎంత మంది ఉంటారో డౌట్
` పదవికి రాజీనామా చేసిన కేబినెట్ మంత్రి దారా సింగ్ చౌహాన్
దిల్లీ,జనవరి 12(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తోన్న తరుణంలో యూపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి 24 గంటల వ్యవధిలోనే మరో షాక్ తగిలింది. కేబినెట్ మంత్రి దారా సింగ్ చౌహాన్ పదవి నుంచి వైదొలిగారు. నిన్న బీసీ వర్గంలో బలమైన నేత స్వామి ప్రసాద్ మౌర్య మంత్రి పదవి రాజీనామా చేయగా.. ఇప్పుడు చౌహాన్ ఆ వరుసలో చేరారు. ఈయన కూడా బీసీ వర్గంలో కీలక నేతనే కావడం గమనార్హం. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే నెల నుంచి జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ సమయంలో కీలక నేతలు మంత్రి వర్గాన్ని వీడటం భాజపాకు గట్టి దెబ్బనే చెప్పాలి. ఇప్పటివరకూ ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా.. వారంతా సమాజ్‌వాదీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ‘నేను ఈ ప్రభుత్వంలో అంకితభావంతో పనిచేశాను. వెనకబడిన, అణగారిన వర్గాలు, దళితులు, రైతులు, నిరుద్యోగ యువత పట్ల ఈ ప్రభుత్వం అణచివేత వైఖరితో వ్యవహరిస్తోంది. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని చౌహాన్ రాజీనామా లేఖలో పేర్కొన్నారు. స్వామి ప్రసాద్ మౌర్య కూడా ఇదే కారణం చెప్పి మంత్రి పదవి నుంచి వైదొలిగారు.