యోగాతో శాంతి, సద్భావన
– రాజ్‌పథ్‌లో గిన్నిస్ రికార్డు
– విశ్వవ్యాప్తంగా యోగా దినోత్సవం
దిల్లీ:రాజ్ పథ్ లో జరిగిన యోగా డే వేడుకలకు ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగా గురు రాందేవ్ బాబాతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, 152 దేశాల దౌత్యవేత్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దాదాపు 40 వేల మంది జనం కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆహుతులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ యోగా డే తో కొత్త శకం మొదలైందన్నారు. యోగాతో శాంతి, సద్భావన లభిస్తాయని చెప్పారు. యోగా వలన రాజ్ పథ్ యోగా పథ్ గా మారిందని అభివర్ణించారు.సమాజంలో ప్రతి ఒక్కరూ యోగాను పాటించాలని ప్రధాని సూచించారు. శాంతి, సద్భావన కోసమే అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామన్న ప్రధాని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యోగాభ్యాసం మానవాళికి భారత్ ఇస్తున్న అపూర్వ కానుకని చెప్పారు. శరీరం, మనసు, అత్మలను సమన్వయపరిచే శక్తి యోగాకు ఉందన్న ఆయన శాంతి మార్గంలో జీవితం గడపడానికి యోగా ఉపకరిస్తుందన్నారు. అనంతరం అందరితో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి మేరకు జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 197 దేశాల్లో ఆదివారం నాడు యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పలు దేశాల్లోని భారత |త్య కార్యాలయాల అధికారులు ఆయా దేశాల్లో యోగా దినోత్సవ కార్యక్రమాలను పర్యవేక్షించారు. తెయవాన్ రాజధాని తెయపీలో దాదాపు 2000మంది ఓకేచోట చేరి సూర్యనమస్కారాలతో యోగా డేను ప్రారంభించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారతావని యోగాతో గిన్నిస్‌రికార్డు నెలకొల్పింది. నరేంద్రమోదీ సారధ్యంలో దిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించిన యోగా ప్రదర్శన గిన్నిస్‌రికార్డు సాధించింది. ఏకకాలంలో ఒకేచోట 35,985 మంది యోగా చేసి ఈ రికార్డును నెలకొల్పారు.
మరో రికార్డు కూడా…
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఏకకాలంలో ఎక్కువమంది పాల్గొన్న యోగా ప్రదర్శనకు గిన్నిస్ రికార్డు దక్కిన విషయం తెలిసిందే. దీంతో పాటు ఒకే కార్యక్రమానికి సంబంధించి ప్రపంచంలోని వివిధ దేశాల్లోని విభిన్న జాతీయులు పాల్గొనడంపై కూడా మరో రికార్డు కూడా గిన్నిస్‌లో నమోదు కావడం గమనార్హం.
యోగాడేలో సెల్ఫీకీ దూరంగా ప్రధాని
టెక్నాలజీలో ముందుండే ప్రధాని మోదీ గత కొద్ది రోజులుగా సెల్ఫీలతో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని యోగాసనాలు వేసిన మోదీ ఈ సారి సెల్ఫీకి దూరంగా ఉన్నారు. దాదాపు 35వేల మంది ఈ ఉదయం రాజ్‌పథ్ వద్ద యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా అనంతరం ప్రజలు మోదీకి సెల్ఫీ దిగేందుకు పోటీపడగా ప్రధాని సున్నితంగా తిరస్కరించారు.
దేశ రాజధాని ఢిల్లీలో తొలి అంతర్జాతీయ యోగా డే వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి భవన్ లో సిబ్బందితో కలిసి ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జి యోగా డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి యోగా ద్వారా ప్రజలంతా శాంతి, సంతోషాలతో జీవనం గడపాలని ఆకాంక్షించారు. అనేక శారీరక, మానసిక రుగ్మతల నిర్మూలనకు యోగా మంచి సాధనంగా ఉపకరిస్తుందన్నారు. భారత సంస్కృతిలో భాగమైన యోగాను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో పాటిస్తుండటం సంతోషంగా ఉందని చెప్పారు.
శరీరం, మనసు, అత్మలను సమన్వయపరిచే శక్తి యోగాకు ఉందన్న ఆయన? శాంతి మార్గంలో జీవితం గడపడానికి యోగా ఉపకరిస్తుందన్నారు. అనంతరం అందరితో కలిసి ప్రధాని యోగాసనాలు వేశారు.
యోగా దినోత్సవంలో పాల్గొన్న కేజ్రీవాల్, సిసోడియా
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాజపథ్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో ఒక ముఖ్యమైన అలవాటుగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.
5వేల సంవత్సరాల నుంచే భారత్‌లో యోగా: సుష్మాస్వరాజ్
న్యూయార్క్: భారత్‌లో ఐదు వేల సంవత్సరాలు నుంచే యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యోగా దినోత్సవాన్ని 192 దేశాలు జరుపుకున్నాయని తెలిపారు. యోగాకు మతం, జాతి లేదన్నారు. ఐరాస ప్రధాన కార్యాలయం వద్ద నిర్వహించిన యోగా దినోత్సవం సందర్భంగా వేలాది మంది ఔత్సాహికులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ పాల్గొన్నారు.