యోగి సొంతగడ్డలో బలిపీఠంపై బాలలు

– గోరఖ్‌పూర్‌ లో ఘోరం జరిగింది

– ఆక్సిజన్‌ అందక 63 మంది బలి

లక్నో,ఆగష్టు 12(జనంసాక్షి): చిన్నారుల వరుస మరణాలతో ఉత్తరప్రదేశ్‌ వణికిపోతోంది. గోరఖ్‌పూర్‌లోని బాబా రాఘవ్‌దాస్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన పిల్లల సంఖ్య 63కు పెరిగింది. బాబా రాఘవ్‌ దాస్‌ (బీఆర్‌డీ) ప్రభుత్వ వైద్యకళాశాల ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదంలో మరో ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. శనివారం తెల్లవారుజాము నుంచి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆగస్టు 9 నుంచి ఈ ప్రమాదం కారణంగా మృతిచెందిన చిన్నారుల సంఖ్య 33కు చేరింది. కాగా.. ఐదు రోజుల్లో ఈ ఆసుపత్రిలో 63 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. వీరిలో అప్పుడే పుట్టిన శిశువులు కూడా ఉన్నారు. గడిచిన 48 గంటల్లోనే 33 మంది చిన్నారులు మృతిచెందారు. గురువారం 23 మంది చనిపోగా.. శుక్రవారం ఏడుగురు.. శనివారం ఉదయం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. విషయం వెలుగులోకి రాకముందు బుధవారం 9 మంది, మంగళవారం 12 మంది, సోమవారం మరో 9 మంది చిన్నారులు మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ వారంలో 63 మంది చిన్నారులు ఈ ప్రమాదానికి బలైనట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ అందక గోరఖ్‌పూర్‌ బీఆర్‌డీ ఆసుపత్రిలో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆక్సిజన్‌ సరఫరా చేసే గుత్తేదారు సంస్థకు ఈ ఆసుపత్రి రూ. 70లక్షల మేరకు బకాయి పడింది. వాటిని చెల్లించకపోవడంతో ఆ సంస్థ ఆక్సిజన్‌ను నిలిపివేసింది. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందుబాటులో లేని కారణంగానే వీరంతా మృత్యువాత పడ్డారు. కానీ వైద్యులు మాత్రం మరణాలకు వేర్వేరు కారణాలున్నాయని వాదిస్తున్నారు.శుక్రవారం సాయంత్రం బీఆర్‌డీ ఆస్పత్రి అధికారులు విడుదల చేసిన ప్రకటనను బట్టి.. పిల్లల వార్డు, మెదడువాపు వార్డుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల్లో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టు 9 నుంచి 11 వరకూ చోటుచేసుకున్న ఈ మరణాల్లో కేవలం 11 కేసులపై మాత్రమే శాఖాపరమైన విచారణకు ఆదేశించామని అధికారులు చెప్పారు. మిగిలినవారంతా రకరకాల వైద్య కారణాలతో చనిపోయారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, శనివారం తెల్లవారు జాము నుంచి ఉదయం 11 గంటల మధ్య మరో ముగ్గురు చిన్నారులు తుదిశ్వాస

విడిచారు. చిన్నారుల మరణాల సంఖ్య గంటగంటకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ శనివారం ఉదయం అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. వైద్య శాఖ మంత్రి సిద్దార్థ్‌ నాథ్‌ సింగ్‌ సహా శాఖల ఉన్నతాధికారులు, బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీ డీన్‌ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. చిన్నారులు చనిపోవడానికి కారణంగా భావిస్తోన్న ఆక్సిజన్‌ సరఫరాను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం.. అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

పేదల వైద్యానికి పెట్టింది పేరు

యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ గతంలో ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్‌లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి బాబా రాఘవ్‌ దాస్‌ మెడికల్‌ కాలేజీ. గోరఖ్‌పూర్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన పేదలంతా వైద్యం కోసం ఇక్కడికే వస్తుంటారు. ఆస్పత్రిలో రోగులకు అవసరమైన ఆక్సిజన్‌ సరఫరా కాంట్రాక్టును ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించారు. అయితే కొద్ది నెలలుగా చెల్లింపులు లేకపోవడంతో సుమారు రూ.70 లక్షల బకాయిలు పేరుకుపోయాయి. పలుమార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేకపోవడంతో ప్రైవేటు సంస్థ.. ఆగస్టు 9 నుంచి ఆక్సిజన్‌ సరఫరా నిలిపివేసింది. దీంతో చిన్నారులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోవడం మొదలైంది. పసి ప్రాణాలు బలితీసుకున్న గోరఖ్‌పూర్‌ దుర్ఘటనపై విస్మయం కలిగించే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. బాబా రాఘవ్‌ దాస్‌ మెడికల్‌ కాలేజీలో ఆక్సిజన్‌ అందని కారణంగా శుక్రవారం ఒక్కరోజులో 30 మంది పిల్లలు చనిపోయారు.

రెండ్రోజుల క్రితమే ఆస్పత్రిని సందర్శించిన యోగి

ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. అంతకు ముందు రెండ్రోజుల క్రితమే సీఎం ఆ ఆస్పత్రిని సందర్శించి వచ్చారు. అయితే వైద్యులు అక్కడ ఇలాంటి సమస్యలేవీ ఉన్నట్టు సీఎం దృష్టికి రానివ్వకపోవడం గమనార్హం. సీఎం యోగితో సమావేశమైన తర్వాత ఆరోగ్యమంత్రి సిద్దార్థనాథ్‌ సింగ్‌ విూడియాతో మాట్లాడారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను వదిలే ప్రసక్తే లేదనీ… సత్వరమే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ నెల 9న ముఖ్యమంత్రి తనంత తానుగా ఆ ఆస్పత్రికి వెళ్లారు. ఒక్క డాక్టర్‌గానీ, అధికారి గానీ అక్కడ ఆక్సిజన్‌ సరఫరా అందడం లేదన్న విషయం చెప్పలేదు. మరే ఇతర సమస్యలను కూడా ప్రస్తావించలేదు అని పేర్కొన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి తమకు కొన్ని సూచనలు చేశారనీ.. శనివారం తాము గోరఖ్‌పూర్‌ ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సవిూక్షించనున్నట్టు తెలిపారు. ముఖ్యమంత్రితో సమావేశం అయిన తర్వాత యూపీ ఆరోగ్యమంత్రి సిద్దార్థ్‌ నాథ్‌ సింగ్‌, మెడికల్‌ విద్య మంత్రి అశుతోష్‌ టాండన్‌ ఇద్దరూ గోరఖ్‌పూర్‌ ఆస్పత్రికి వెళ్లనున్నారు. కాగా శనివారం ఉదయం ఆక్సిజన్‌ అందని కారణంగా మరో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆక్సిజన్‌ అందని కారణంగా పిల్లలకు ఎన్సిఫలిటిస్‌ సోకినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మెదడుపై అత్యంత వేగంగా ప్రభావం చూపే ఈ వ్యాధి కారణంగానే ఒక్కరోజులో 30 మంది పిల్లలు బలయ్యారు.