రంజాన్‌ కార్యక్రమాలకు పటిష్ట భద్రత

4
– మస్జిద్‌ ఇమామ్‌లు,పోలీస్‌ అధికారులతో ఏకే ఖాన్‌ ప్రత్యక్ష సమీక్ష

హైదరాబాద్‌,జులై5(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా చేపడుతున్న ఇఫ్తార్‌ విందు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది. ఈనెల 12న జంట నగరాల్లోని 100 మసీదుల్లో నిర్వహించే ఈ కార్యక్రమ ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులు ఈరోజు హజ్‌హౌస్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముస్లిం మతపెద్దలు, ఇమాంలు, మసీదు కమిటీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత వర్గాలు సహకరించాలని ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ కోరారు. ఇఫ్తార్‌ విందు రోజున మహిళలు సైతం హాజరయ్యే అవకాశం ఉందని, వస్‌ాల పంపిణీ సందర్భంగా తొక్కిసలాట జరగకుండా చూడాలని సూచించారు. ఏవైనా లోపాలు, పొరపాట్లు జరిగితే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమం కోసం సైబరాబాద్‌, హైదరాబాద్‌ పోలీసు విభాగాలు కలిసి పనిచేస్తాయని, మసీదు కమిటీలు సహకరించాలని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహేందర్‌రెడ్డి కోరారు.