రక్షణరంగంలో వియత్నాంకు బాసట

C

– 12 ఒప్పందాలపై సంతకాలు

– వియత్నాంలో పీఎం మోదీకి ఘనస్వాగతం

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 3(జనంసాక్షి): భారత ప్రధాని నరేంద్రమోదీ వియత్నాం పర్యటన సందర్భంగా పలు ఒప్పందాలపై అంగీకారం కుదిరింది. వియత్నాం పర్యటన సందర్భంగా హనోయ్‌లో ఆదేశ ప్రధానితో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో భారత్‌-వియత్నాం మధ్య 12 ఒప్పందాలపై అధికారులు సంతకాలు చేశారు. అలాగే భారత్‌ కూడా ఆ దేవ రక్షణ రంగంలో తోడ్పాటుకు ముందుకు వచ్చింది. శుక్రవారం అర్థరాత్రి వియత్నాం చేరుకున్న ప్రధాని మోదీకి వియత్నాం నేతలు ఘనస్వాగతం పలికారు. స్థానిక ప్రెసిడెన్షియల్‌ ప్యాలెస్‌లో భద్రతా దళాల నుంచి మోదీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా వియత్నాం అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. ¬చిమిన్‌ నివసించిన ఇంటిని మోదీ సందర్శించారు.అనంతరం ప్రధాని మోదీ, వియత్నాం ప్రధాని సంయుక్త విూడియా సమావేశం నిర్వహించారు. మోదీ మాట్లాడుతూ.. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరిగాయని తెలిపారు. రక్షణ, భద్రత రంగాల్లో ఒప్పందాలు సంతోషకరమని పేర్కొన్నారు. వియత్నాంతో ఒప్పందం వల్ల ఇరు దేశాల ఆర్థికాభివృద్ధికి అవకాశముందన్నారు. వియత్నాం బలమైన ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. జాతీయ దినోత్సవం సందర్భంగా వియత్నాం ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వియత్నాం ప్రజలు చూపిన అభిమానం మనసును ఆకట్టుకుందని పేర్కొన్నారు. మరోవైపు వియత్నాంకు భారత్‌ భారీ సాయాన్ని ప్రకటించింది. ఆ దేశానికి 500 మిలియన్ల డాలర్లు అప్పు ఇచ్చేందుకు భారత్‌ అంగీకరించింది. రక్షణ రంగ సహాకారం కోసం ఆ డబ్బును ఖర్చు చేయనున్నారు. నాహ్‌ ట్రాంగ్‌లో ఏర్పాటు చేయనున్న సాఫ్ట్‌వేర్‌ పార్క్‌ కోసం కూడా భారత్‌ 50 లక్షల డాలర్ల సహాయాన్ని అందివ్వనుంది. వియత్నాం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ దేశంతో మొత్తం 12 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వియత్నాం ప్రధాని నుయన్‌ గ్జాన్‌ పుక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యూహాత్మక ఒప్పందాన్ని, సమగ్ర ఒప్పందంగా మార్చాలనుకుంటున్నామని, ఇది భవిష్యత్తులో రెండు దేశాల అభివృద్ధికి ఉపయోగ పడుతుందని, ద్వైపాక్షిక సంబంధాలు ఇది చాలా అవసరమని మోదీ అన్నారు. ప్రాంతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు మోదీ తెలిపారు. రక్షణ రంగంతో పాటు ఐటీ, స్పేస్‌, డబుల్‌ టాక్సేషన్‌, షిప్పింగ్‌ సమాచారం లాంటి అంశాలపై కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. వియత్నాం కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ మోదీ ఆహ్వానించారు.