రక్షాబంధన్‌కు పలుచోట్ల ఆధారాలు

Raksha Bandhan / Rakshabandhan Rakhi with Haldi Kumkum rice, sweet Mithai, Gift Box, selective focus

పౌర్ణమిని నూలి పున్నమిగా గుర్తింపు
తిరుమల,ఆగస్ట్‌19 (జనం సాక్షి) శ్రావణమాసంలో అనేక పర్వదినాలు వస్తుంటాయి. విష్ణుమూర్తి జన్మనక్షత్రం శ్రవణం. ఈ నక్షత్రం చంద్రునితో కూడిన మాసం కావడంతో శ్రావణమాసం అంటారు. ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. ఆకాశం మబ్బులతో వెండికొండలను తలపిస్తుంటుంది. పూర్వకాలం వేద అధ్యయనం శ్రావణమాసంలోనే ప్రారంభమయ్యేది. విష్యత్‌పురాణంలో రక్షాబంధన్‌ గురించి వివరించారు. బలి చక్రవర్తిని విష్ణుమూర్తి దేవతల కోరిక మేరకు బంధిస్తాడు. అయితే ఈ బంధం అతనికి రక్షణగా
నిలుస్తుందని వరమిచ్చినట్టు తెలుస్తోంది. పాల్కురికి సోమనాధుడు ఈ పౌర్ణమిని నూలి పున్నమిగా అభివర్ణించాడు. కర్ణాటకలో నారికేళ పున్నమిగా పండగ నిర్వహిస్తారు. శ్రావణ పూర్ణిమను భారతదేశమంతా స్థానిక సంప్రదాయాల నేపధ్యంలో వేడుకగా నిర్వహిస్తుంటారు. నార్లీ పండగ, నూలి పున్నమి ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. భారతావనిలో శ్రావణ పౌర్ణమిని పర్వదినంగా పాటించడం వేదకాలం నుంచీ ఉంది. వేదాధ్యయనం చేసేవారు ఉపాకర్మ అనే పేరుతో శ్రావణ పౌర్ణమి రోజున విశేష కార్యాలను నిర్వర్తిస్తుం డేవారు. వారి నియమాలలో ఒకటైన యజ్ఞోపవీతధారణకు ఈ రోజున ప్రాధాన్యాన్ని ఇస్తుండేవారు. ఉపనయనం అనే విధి సంస్కారం దీనికి ఆధారంగా ఉండేది. యజ్ఞోపవీతాన్నే యజ్ఞ సూత్రం అని కూడా అంటారు. ఈ పౌర్ణమినాడు మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్టాల్లో సముద్రతీర వాసులు సముద్రం దగ్గరకు వెళ్లి సముద్రుడిని పూజించి కొబ్బరికాయలను కొడతారు. అందుకే దాన్ని నార్లీ పౌర్ణమి అనిపిలుస్తారు. వేదకాలంలో ఇది సాక్షాత్తు విష్ణుశక్తి స్వరూపంగా ఉన్నట్లు తెలుస్తోంది. రక్షా బంధాన్ని ఇప్పట్లోలా సోదరి, సోదరుడికి కట్టడమనేది తొలిరోజుల్లో ఉండేది కాదు. భర్త చేతికి భార్య కట్టేది. శత్రు జయాన్ని కలిగిస్తాయన్న నమ్మకంతో ఆవాలు, అక్షతలను వేసి పొట్లం కట్టేవారు. ఆవాలు, అక్షితలను రక్షాద్రవ్యం అనేవారు. ఈ రక్షాద్రవ్యాలున్న పొట్లాన్ని ఒక పరిశుభ్రమైన వస్త్రంలో ఉంచి మూటకట్టేవారు. దాన్ని పీఠంపై ఉంచి పూజించిన తర్వాత దాన్ని పురోహితుడితో చేతికి కట్టించుకునేవారు. పూజ చేసిన ఆ పొట్లం విష్ణుశక్తికి ప్రతిరూపమని నమ్మకం. ఆరోజుల్లో రాక్షసులకు, దేవతలకు చాలాకాలం యుద్ధం జరిగింది. రోజురోజుకూ దేవతల శక్తి సన్నగిల్లడం చూసిన ఇంద్రుని భార్య శచీదేవి శ్రావణ పౌర్ణమి నాడు విధివిధానంగా రక్షను రూపొందించి విష్ణుశక్తి స్వరూపమైన ఆ రక్ష మహిమను, శ్రావణ పౌర్ణమి విశేషాలను వివరించి దాన్ని ఇంద్రుడి చేతికి కట్టింది. ఆ తర్వాతే ఇంద్రుడు రాక్షసులను జయించగలిగాడు… ఇలా ఆనాడు ఒక భార్య భర్త చేతికి రక్షా బంధాన్ని కట్టిన సందర్భం ఉంది. కాలక్రమంలో ఆవాలు, అక్షతలు వేసి పూజించి కట్టిన పొట్లం నేడు రాఖీకి మధ్యలో పువ్వుగానో, కుచ్చుగానో మారిపోయి ఉండవచ్చని చెబుతారు. తర్వాత కాలంలో ఇది అన్నకు చెల్లెలు రాఖీగా కట్టే సంప్రదాయంగా మారిపోయి ఉండవచ్చు.