రణ్‌ధీర్‌ సింగ్‌ దారిలోనే టైట్లర్‌ నామినేషన్‌లు ఉపసంహరించుకున్న అనుచరులు

న్యూఢిల్లీ ,నవంబర్‌ 26 :భారత ఒలింపిక్‌ సంఘం ఎన్నికలలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రెసిడెంట్‌ పదవి రేస్‌ నుండి రణ్‌ధీర్‌ తప్పుకున్న 24 గంటలలో అతని మధ్ధతుదారులు కూడా పోటీ నుండి విత్‌డ్రా చేసుకుంటున్నారు. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీపడుతోన్న కబడ్డీ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు జెఎస్‌ గెహ్లాట్‌ తన నామినేషన్‌ ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో వీరేందర్‌ నానావతి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఖాయంగా కనిపిస్తోంది. వీరేందర్‌ అభయ్‌సింగ్‌ చౌతాలా వర్గం నుండి పోటీపడుతున్నారు. ఇక ఎన్నికల బరిలో నుండి తప్పుకున్న వారిలో జాయింట్‌ సెక్రటరీ పోస్టులకు పోటీపడిన ఓంకార్‌సింగ్‌ , సునయన కుమారి ఉన్నారు. అలాగే ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌గా పోటీపడిన జాన్‌ కర్షింగ్‌ , రాజాసిధ్ధు కూడా ఎన్నికల నుండి తన నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం అనూహ్యంగా ప్రెసిడెంట్‌ పదవి నామినేషన్‌ విత్‌డ్రా చేసుకున్న రణ్‌ధీర్‌సింగ్‌ ముఖ్య అనుచరులు జగదీష్‌ టైట్లర్‌ కూడా తన నామినేషన్లను వెనక్కి తీసుకున్నారు. టైట్లర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీ పడ్డారు. అయితే తెరవెనుక మంత్రాంగం ఫలించడంతో రణ్‌ధీర్‌సింగ్‌ బాటలోనే నడిచారు. ఈ పరిణామాలతో డిసెంబర్‌ 5న జరిగే భారత ఒలింపిక్‌ సంఘం ఎన్నికలలో అభయ్‌సింగ్‌ చౌతాలా వర్గం పోటీ లేకుండానే ఎంపిక కానున్నట్టు తెలుస్తోంది.