రఫేల్‌ కొనుగోళ్లలో వందశాతం అవినీతి

 

విచారణ జరిగితే మోడీ జైలుకే

మోదీపై అవినీతి ఆరోపణలు నూరుపాళ్లు నిజం

మరోమారు మండిపడ్డ రాహుల్‌

ఇండోర్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందన్న విషయం స్పష్టమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. దీనిపై విచారణ జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైలుకి వెళతారని పేర్కొన్నారు. ఇండోర్‌లో సీనియర్‌ జర్నలిస్టులతో విూడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ‘దేశ కాపలాదారుడు దొంగ’ అంటూ తాను మోదీపై పలు బహిరంగ సభల్లో చేస్తున్న వ్యాఖ్యలపై రాహుల్‌ స్పందిస్తూ… ‘మోదీపై అవినీతి ఆరోపణలు చేయడం కాదు.. ఆయన

నిజంగానే అవినీతిపరుడు. ఇందులో తికమకపడాల్సిన అవసరం ఏవిూ లేదు. రఫేల్‌ విషయంలో అవినీతి జరగలేదంటూ చేసే ఇతర వాదనలకు తావులేదు. ఈ ఒప్పందంపై విచారణ మొదలైతే, మోదీ జైలుకి వెళ్లే విషయంపై మాత్రమే ప్రశ్నలు ఉంటాయి’ అని వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందంలో పారిశ్రామికవేత్త అనిల్‌ అంబానీకి అనుకూలంగా వ్యవహరించేందుకు గానూ మోదీ.. నిబంధనలు, చట్టాలను అతిక్రమించారని రాహుల్‌ మరోసారి ఆరోపించారు. ‘ఒకవేళ రఫేల్‌ ఒప్పందం విషయంలో ఒక్క పత్రం బయటకు వచ్చినా, మోదీ, అనిల్‌ అంబానీల పేర్లు మాత్రమే బయటకు వస్తాయని భాజపా నేతలకు తెలుసు. అందుకే, భాజపా ముందు ప్రస్తుతం ఉన్న సమస్య ఎన్నికల్లో గెలుపొందడానికి ప్రయత్నాలు చేయడం మాత్రమే కాదు.. మోదీని ఈ కేసు నుంచి రక్షించడం కూడా అని అన్నారు. ఈ కారణంగానే కేంద్ర దర్యాప్తు బృందం (సీబీఐ) సంచాలకుడిని తెల్లవారు జామున 2 గంటలకు తొలగించారు’ అని ఆయన ఆరోపణలు చేశారు.

శబరిమల వివాదంపై నా అభిప్రాయం ఇదే..

శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి మహిళలందరూ ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్‌ గాంధీ తన అభిప్రాయాన్ని తెలిపారు. మహిళలకు పురుషులతోపాటు సమానంగా అన్ని హక్కులూ ఉంటాయన్నారు. గుడితో పాటు ఎక్కడికైనా సరే.. వెళ్లే హక్కు వారికి ఉంటుందని స్పష్టం చేశారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని, ఈ విషయంలో తనకు, తన పార్టీ నేతలకు మధ్య వేర్వేరు అభిప్రాయాలు ఉండొచ్చని అన్నారు.

వారి కంటే నాకే బాగా హిందూయిజం తెలుసు

ఓటర్లను మోసగించేందుకు ఫ్యాన్సీ డ్రెస్‌ హిందూయిజం ప్రదర్శిస్తున్నారంటూ తనను విమర్శిస్తున్న బీజేపీకి కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఘాటైన సమాధానం చెప్పారు. కాషాయ పార్టీ కంటే హిందూ మతం గురించి తనకు బాగానే తెలుసనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హిందూయిజం గురించి బీజేపీకి ఏమాత్రం అవగాహన లేదన్నారు. అన్నిటికంటే మనకు ఉండాల్సిన ముఖ్యమైన గుణం వినయం. దీనర్థం ఎవరైనా

మాట్లాడుతున్నప్పుడు ముందు వాళ్లు చెప్పేది విని, అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కోపంగా మాట్లాడుతున్నవాళ్లు పిచ్చివాళ్లని నేను భావించను. అసలు వారు ఎందుకు కోపంగా ఉన్నారో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాను. బీజేపీకి అసలు హిందూయిజం అంటే ఏంటో ఏమాత్రం అర్థం కాలేదు. వారికంటే హిందూయిజం గురించి నాకు బాగానే తెలుసు..అని రాహుల్‌ చురకలు వేశారు.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్టాల్లో ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో… ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు మత రాజకీయాలపై ప్రధానంగా దృష్టిపెట్టాయి. రాహుల్‌ గాంధీ ఉజ్జయినీలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకే రాహుల్‌ హిందూత్వ నినాదాన్ని అందుకున్నారంటూ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.