రబీలోనూ 9గంటల విద్యుత్
– రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
– మంత్రి హరీశ్
వరంగల్,అక్టోబర్ 15(జనంసాక్షి): కాలంగాని సమయంలోనే కాదు, బాగా కాలం అయి ప్రాజెక్టులు, చెరువుల నిండిన ప్రస్తుత తరుణంలో కూడా రైతులకు వ్యవసాయానికి 9గంటల కరెంట్ ఇస్తున్నామని, కాంగ్రెస్ గుర్తు పెట్టుకోవాలని భారీనీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కరెంట్‌కు కొరత లేకుండా, కోత లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే నని అన్నారు. గతంలో ఏనాడు రైతుల సమస్యలు పరిష్కరించలేకపోయిన కాంగ్రెస్ వాళ్లు …ఇవాళ సమస్యలంటూ రోడ్డెక్కుతున్నదీ వాళ్లేనని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కానీ తెలంగానలో కెసిఆర్ లక్ష్యం రైతు సంక్షేమమేనని అన్నారు. గతంలో రైతులు విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కని రోజు లేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పరకాల, ఆత్మకూరు మండలం గూడెప్పాడు మార్కెట్ యార్డు పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవ సభల్లో మంత్రి మాట్లాడారు. మామునూరు మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు వెంట స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రబీలో రైతులకు 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిశాయని రైతులంతా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. రైతులంతా సంతోషంగా ఉంటే ఇవాళ వాళ్లకు గుర్తొచ్చినట్టు కాంగ్రెస్ నేతలు రైతు సంక్షేమం అంటూ మొసలి కన్నీరు పెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడూ ప్రాజెక్టులు
పూర్తిచేయలేదని, ఇప్పుడు పెండింగ్ ప్రాజెక్టులను ప్రభుత్వం పూర్తి చేస్తుందని వెల్లడించారు. వరంగల్ జిల్లాకు ఎస్సారెస్సీ ద్వారా స్టేజ్-1,2 నీళ్లను ఇస్తామన్నారు. వరంగల్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు రూ.6.30 కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయం దండగ అన్న పార్టీ టీడీపీ అని విమర్శించారు. అలాంటి పార్టీ ఇవాళ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతుందని మండిపడ్డారు. వరంగల్లో ధర్నా నిర్వహించారని, రైతులను కాల్చి చంపిన పార్టీకి ధర్నా చేసే హక్కు ఎక్కడిదన్నారు. చంద్రబాబు తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్నారని విరుచుకు పడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని దుయ్యబట్టారు. రైతుల విూద ప్రేమ నిజమే అయితే టీ టీడీపీ నేతలు చంద్రబాబు ఢిల్లీలో ఇచ్చిన లేఖను వెంటనే వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తేవాలన్నారు. రైతులకు టీ టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలన్నారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్‌కు ఒక ఎజెండా లేదని విమర్శించారు. ఎప్పుడేం చేయాలో విపక్షాలకు తెలియడంలేదని విమర్శించారు. దేశంలోనే మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీలన్నీ రైతులకు మద్దతు ధరలు చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వారి ధాన్యం నిల్వ చేసుకునేలా చేయాలన్నారు. ఉద్యమంలో పాటుపడ్డట్లుగానే మార్కెట్ కమిటీ నేతలు రైతుల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉండాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని తెలిపారు. గతంలో మత్య్సశాఖ ఆంధ్రా కోసమే పనిచేసేదని విమర్శించారు. గతంలో మొత్తం మత్స్య శాఖకు కేవలం కోటి రూపాయలు మాత్రమే చేప పిల్లలకు కేటాయించేవారని దుయ్యబట్టారు. కానీ ఇవాళ సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు కేటాయించారని వివరించారు. దీంతో రైతులపట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న ప్రేమెంతో అర్తమవుతుందని తెలిపారు. ప్రతీ చెరువుకు వంద శాతం సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం చేప పిల్లలను నీటిలో వదులుతున్నామని తెలిపారు. 40 కోట్ల చేప పిల్లలను లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ణయించామన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా జలాశయాలు పూర్తిగా నిండి ప్రజలంతా సంతోషంగా పండుగ చేసుకుంటుంటే ప్రతిపక్ష పార్టీల నేతలు ఓర్వలేకపోతున్నారు. పూర్తిగా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఊరందరిది ఒకదారి అయితే ఉలిపికట్టెది మరోదారి అన్నట్లుగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. పుష్కలంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టులు, చెరువు, కుంటలు నిండాయని, తమకు రెండేళ్ల వరకు ఢోకా లేదని రైతులు సంతోషంగా ఉన్నారు. ప్రతిపక్షాలు మాత్రం బురద రాజకీయాలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పనిచేస్తున్నది. రూ. 17వేల కోట్ల పంటరుణాలను మాఫీ చేసింది. ఇందులో ఇప్పటికే రూ.10వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2010 కరువు, వడగండ్లు, నీలం తుఫానుతో నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించలేదు. 2014జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.600కోట్ల ఇన్‌సబ్సిడీ ఇచ్చిందని మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తున్నదని, తెలంగాణను కోటి ఎకరాల మాగాణి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోర్టులకు వెళ్తూ కాంగ్రెస్, టీడీపీలు ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. రైతులను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు.
మిషన్‌కాకతీయ ద్వారా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకం చేపట్టిన చెరువుల పునరుద్ధరణ సత్ఫలితాలనిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. పునరుద్ధరణ చేయడంతోనే ఎక్కడా చెరువులకు గండ్లు పడలేదన్నారు. అన్ని జలాశయాల్లో చేపపిల్లలు వేస్తున్నామన్నారు. రబీ సాగుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, ఎన్ని ఇబ్బందులున్నా సాగుకు 9గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం 7వేల మెగావాట్ల విద్యుత్ ఖర్చవుతుందని, రబీలో 10వేల మెగావాట్లకు పెరిగే అవకాశముందన్నారు. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేయడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు. నకిలీ విత్తనాల సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 90మంది డీలర్లను అరెస్ట్ చేశామని, ఇద్దరు విత్తన కంపెనీల యజమానులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై పీడీ యాక్టులు ప్రయోగిస్తామని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. రైతుల కోసం రూ.వెయ్యి 24కోట్లతో తెలంగాణ వ్యాప్తంగా గోదాములు నిర్మిస్తున్నామని, వాటితో రైతులు ఎంతో ప్రయోజనం పొందనున్నారన్నారు. మిషన్ కాకతీయ పథకంతో పూడిక తీసిన చెరువులన్ని నిండాయని స్పీకర్ మధుసూధనాచారి అన్నారు. చెరువులన్నీ కళకళలాడుతున్నాయని తెలిపారు. వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగలా మార్చారని కొనియాడారు. గతంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. సకాలంలో రైతులకు విత్తనాలు, ఎరువులు అందకపోయేదని తెలిపారు. రైతులు అడగక ముందే సీఎం కేసీఆర్ అన్ని చేస్తున్నారని పేర్కొన్నారు. ఇకపెఓతే మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని డిప్యూటి సిఎం కడియం శ్రీహరి అన్నారు. గతంలో ఏనాడు ఇలాంటి ప్రయత్నం జరగలేదన్నారు. దీనికి కృషి చేసిన మంత్రి హరీస్ రావు అభినందనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి పసునూరి దయాకర్,ఎమ్మెల్యే కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు.