రమణ్‌సింగ్‌ అవినీతిపై..  మోదీ నోరువిప్పాలి


– అవినీతిపై పోరాడతాననేది ఒట్టిమాటలేనా?
– పనామా పేపర్లలో రమణసింగ్‌ కుమారుడు ఉన్నది వాస్తవం కాదా
– ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు
– ఛత్తీస్‌గడ్‌ ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలి
– ఛత్తీస్‌గడ్‌ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ
రాయ్‌పూర్‌, నవంబర్‌10(జ‌నంసాక్షి) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడతారు కానీ, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలపై మాత్రం మౌనం వహిస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ నెల 12న ఆ రాష్ట్ర అసెంబ్లీ తొలిదశ పోలింగ్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని చరామా ప్రాంతంలో  జరిగిన సభలో శనివారం రాహుల్‌ పాల్గొని ప్రసంగించారు. ఈ నాలుగైదేళ్లలో ప్రధాని మోదీ.. 15 మంది సంపన్నులకు
రూ.3.5 లక్షల కోట్లు ఇచ్చారన్నారు. మహాత్మా గాంధీ గ్రావిూణ ఉపాధి హావిూ పథకం దేశ వ్యాప్తంగా అమలు కావడానికి ఏడాదికి రూ.35,000 కోట్లు అవసరమని, అందుకు ఏకంగా 10 రెట్ల నగదును 15 మంది పారిశ్రామికవేత్తలకు ఆయన ఇచ్చేశారని విమర్శించారు. మా పార్టీ అధికారంలోకి వస్తే అదే డబ్బును దేశంలోని రైతుల, యువత, పేదల, మహిళల, గిరిజనుల కోసం ఖర్చు చేయాలనుకుంటోంద అని ఆయన వ్యాఖ్యానించారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని మోదీ చెప్పుకుంటున్నారని, కానీ, ఆయన ఛత్తీస్‌గఢ్‌కు వస్తే.. ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ అవినీతిపరుడన్న విషయాన్ని మాత్రం చెప్పరన్నారు. ప్రజల సొమ్ము రూ.5,000 కోట్లు చిట్‌ఫండ్‌ కుంభకోణంలో మాయమయ్యాయని రాహుల్‌ ఆరోపించారు. దీనిపై 310 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, కానీ, ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదన్నారు. ఎందుకంటే ఈ కుంభకోణంలో ముఖ్యమంత్రి కూడా ఉన్నారని అన్నారు. పనామా పేపర్లలో ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి కుమారుడి పేరు వెలుగు చూసిందని, ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్న విషయాన్ని ప్రజలకు రమణ్‌ సింగ్‌ తెలపాలన్నారు. పనామా పేపర్లలో పేరు బయటకు వచ్చినందుకు పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి నవాజ్‌ షరీష్‌ కూడా జైలుకు వెళ్లారని రాహుల్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌.. ఐదేళ్లలో వ్యవసాయంలో గణనీయమైన అభివృద్ధి సాధించి దేశం మొత్తానికి పండ్లు, కూరగాయలు, బియ్యం సరఫరా చేసే రాష్ట్రాలుగా ఉండాలని తాను కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ మొదటి దశ పోలింగ్‌ ఈ నెల 12న, రెండో దశ 20న జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఈ నెల 28న ఎన్నికలు జరుగుతాయి.