రవాణా భారం కాకూడదనే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు
కరీంనగర్,ఏప్రిల్20(జనంసాక్షి): రైతు పండించిన ధన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి రవాణా భారం, కాలయాపన లేకుండా ఉండేందుకే గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ వివరించారు. కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన తేమలేని ధాన్యాన్ని తెచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర పొందాలని సూచించారు. క్వింటాలు ధాన్యానికి మద్దతు ధర మొదటి రకానికి రూ.1590, సాధారణ రకానికి రూ. 1550 చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉభయ కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో వరుసగా కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. రైతులకు సర్కారు మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతు పండించిన పంటలను దళారులకు అమ్మి నష్టపోకుండా ఉండేందుకు గానూ మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేయాలని అధికారులను ఆదేశించారు.