రష్యాకు రామస్వామి భారీ ఆఫర్
అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్‌కు చెందిన వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే వరుసగా మీడియా ఇంటర్వ్యూలు, చర్చా వేదికల్లో పాల్గొంటున్నారు. వివిధ అంశాల గురించి తన ఆలోచనలను పంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ వార్తా సంస్థ ఫాక్స్ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇచ్చారు.
చైనా విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే రష్యాను, చైనా నుంచి దూరం చేయాలని రామస్వామి అభిప్రాయపడ్డారు. తాను ఎన్నికైతే ఒప్పందం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకుంటానని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఉక్రెయిన్-రష్యాల మధ్య ప్రస్తుతం నియంత్రణ రేఖ ఉండేలా చేస్తానన్నారు. అదేవిధంగా నాటో కూటమిలోకి ఉక్రెయిన్‌ను అనుమతించబోనని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రష్యాపై విధించిన ఆంక్షలు ఎత్తేస్తానంటూ ప్రకటించారు. అయితే, ఇవన్నీ జరగాలంటే రష్యా.. చైనాతో సైనిక కూటమి నుంచి వైదొలగాల్సి ఉంటుందని రామస్వామి ఓ కండిషన్ పెట్టారు.
‘నేను రష్యా-ఉక్రెయిన్ మధ్య ప్రస్తుత నియంత్రన మార్గాలను స్తంభింపజేస్తాను. ఉక్రెయిన్‌ను నాటోలోకి అనుమతించను. ఇందుకు నేను కట్టుబడి ఉంటాను. పుతిన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ఇది సరిపోతుంది. కానీ, ప్రతిఫలంగా నాకు ఇంకా గొప్పది కావాలి. రష్యా చైనాతో సైనిక సంబంధాలను విడిచిపెట్టాలి. అలాచేస్తే రష్యాతో పాశ్చాత్య ఆర్థిక సంబంధాలను తిరిగి కొనసాగిస్తాం’ అని రామస్వామి తెలిపారు. రష్యా-చైనా సైనిక కూటమి నేడు అమెరికా ఎదుర్కొంటున్న ఏకైక అతిపెద్ద ముప్పు అని రామస్వామి అన్నారు.