రష్యాను గట్టిగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్‌


రష్యాదళాలను మట్టుబెడుతున్న బలగాలు
భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నా ఆగని రష్యా దాడులు
మాస్కో,ఫిబ్రవరి28 (జనంసాక్షి): : రష్యా ఉడుంపట్టుతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు దారుణంగా మారయి. ప్రజలు ఆందోళనతో ఉన్నారు.కొందరు దేశం విడిచి పారిపోతున్నారు. మరికొందరు కదననంగంలో దూకుతున్నారు. రష్యాను నిలవరించేందుకు ఉక్రెయిన్‌ దళాలు గట్టిగానే పోరాడుతున్నాయి. ఈ క్రమంలో వేలాదిమంది రష్యన్‌ సైనికులను మట్టుపెట్టారు. దీంతో రష్యామరింతపట్టుదలతో ముందుకు సాగాలని నిర్ణయించింది. మరోవైపు ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అతలాకుతలం అవుతోంది. ఓవైపు చర్చలకు ఆహ్వానిస్తూనే ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ మాత్రం ఆపడం లేదు. చర్చల పక్రియపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు రష్యా సైన్యం, ఉక్రెయిన్‌ సైన్యం` సాధారణ పౌరుల మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. ఈ తరుణంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియాను రష్యా కూల్చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం మ్రియాను రష్యా దళాలు కూల్చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రభుత్వ అధికారిక ట్విటర్‌ హ్యాండిల్‌ ఆదివారం రాత్రి ప్రకటించింది. మ్రియా అంటే అర్థం కల అని. దానిని కూల్చేశారు. కానీ, బలమైన, స్వేచ్ఛా, ప్రజాస్వామ్య యుతమైన ఉక్రెయిన్‌ కలను మాత్రం నెరవేరుస్తాం అని ఉక్రెయిన్‌ పేర్కొంది . ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో క్యూలెబా ధృవీకరించారు. అతిపెద్ద ఎయిర్‌లిప్ట్‌ కార్గో.. ఆంటోనోవ్‌ డిజైన్‌ బ్యూరో 80వ దశకంలో(సోవియట్‌ యూనియన్‌లో ఉండగానే డిజైన్‌ చేసింది. 1985లో ఏఎన్‌`225 సిద్ధం కాగా.. మూడేళ్ల తర్వాత కార్యకలాపాలను మొదలుపెట్టింది. నిజానికి అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వాటిని మోసుకెళ్లేందుకు ఈ ఎయిర్‌క్రాప్ట్‌ను రూపొందిం చారు. సుమారు 640 టన్నుల బరువును మోసే సామర్థ్యం ఉంది ఈ విమానానికి. రష్యా దళాలు ఉక్రెయిన్‌ హోస్టోమెల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న సందర్బంగా ధ్వంసం చేయగా.. శకలానికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు బయటకు వచ్చాయి. ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ చర్య ఐదవ రోజూ కొనసాగుతున్నాయి. ఒకవైపు చర్చల మంత్రం పటిస్తూనే.. మరోవైపు అస్త్ర సన్యాసం చేయడానికి ఇరు దేశాలు మొగ్గు చూపించడం లేదు. రష్యా దళాలు ముందుకు వెళ్లడం.. ఉక్రెయిన్‌ దళాల ప్రతిఘటనతో ఇరువైపులా ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే సాగుతోంది. బాంబుల మోతతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌ రాజధాని నగరం కీవ్‌.. కార్‌కీవ్‌ నగరాల్లో దాడులను తక్షణమే నిలిపివేయాలని భద్రతా మండలిలో రష్యా దాడులకు వ్యతిరేకంగా భారత్‌ ప్రవేశ పెట్టిన తీర్మానం వీగిపోయింది. వీటో అధికారంతో రష్యా అడ్డుకుంది. ఈ సందర్భంగా.. ఉక్రెయిన్‌లోని తమ పౌరుల భద్రతపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రష్యా దాడులను వెంటనే ఈ మేరకు భద్రతా మండలిలో ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్‌ పరిణామాలపై ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. యూకే ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో ఫోన్‌లో సంప్రదింపులు జరిపారు. రాబోయే 24 గంటలు ఉక్రెయిన్‌కు కీలకమని ఈ సందర్భంగా జెలెన్‌స్కీ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగి ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అవసరమైతే అణ్వాయుధాల ప్రయోగానికీ సిద్ధమనే సంకేతాలు పంపుతున్నారు. ఏ క్షణంలోనైనా ’యుద్ధ విధులకు’ దిగేందుకు సర్వ సన్నద్ధంగా ఉండాల్సిందిగా రష్యా అణ్వాయుధ దళాలను పుతిన్‌ ఆదివారం ఆదేశించారు. రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌ తదితరులతో ఆయన అత్యున్నత స్థాయి సమావేశం జరిపారు. నాటో దేశాధినేతల దుందుడుకు వ్యాఖ్యలకు, రష్యాపై, తనపై విధించిన కఠినమైన ఆంక్షలకు స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. పుతిన్‌ ప్రకటనతో అమెరికా, పాశ్చాత్య దేశాలు కలవరపడు తున్నాయి. వివాదం చివరికి అణు యుద్దానికి దారితీస్తుందేమోనని భయపడుతున్నాయి. అదే జరిగితే వినాశకర పరిణామాలకు దారి తీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదంలో తలదూర్చే దేశాలపై అత్యంత కఠినంగా ప్రతి చర్యకు దిగుతామని యుద్దానికి దిగిన సందర్భంగా పుతిన్‌ గట్టిగా హెచ్చరించడం తెలిసిందే. రష్యా తిరుగులేని అణు శక్తి అంటూ ఆ సందర్భంగా బెదిరించారు కూడా. ఉక్రెయిన్‌ను ఎలాగైనా ఓడిరచేందుకు రసాయనిక, జీవ రసాయన ఆయుధాల ప్రయోగానికి కూడా రష్యా దిగినా ఆశ్చర్యం లేదని ఇంగ్లండ్‌ విదేశాంగ మంత్రి లిజ్‌ ట్రుస్‌ హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజా పరిణామాలపై అమెరికా ఆందోళన వెలిబుచ్చింది. యుద్ధోన్మాదాన్ని అస్సలు అంగీకారం కాని స్థాయికి పుతిన్‌ తీసుకెళ్తున్నారని ఐరాసలో అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ దుయ్యబట్టారు. పుతిన్‌ గనక తన బాంబర్లు, యుద్ధ విమానా లను అణు దాడికి సన్నద్ధం చేసే పక్షంలో అది విపరిణామాలకే దారి తీయొచ్చు. అమెరికా కూడా అదే మాదిరిగా స్పందించక తప్పని పరిస్థితి తలెత్తుతుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌లో న్యూక్లియర్‌ అనలిస్టు హన్స్‌ క్రిస్టెన్సన్‌ అభిప్రాయపడ్డారు. అది అంతర్జాతీయంగా పెను ఉద్రిక్తతలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్‌ కేంద్రాల భద్రతపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆందోళన వెలిబుచ్చింది. వాటికి ప్రమాదం కలిగించే చర్యలకు దిగొద్దని రష్యాకు సూచించింది.
అలాంటి చర్యలు భారీ ప్రాణ, పర్యావరణ నష్టానికి దారి తీయవచ్చని ఐఏఈఏ డైరెక్టర్‌ జనరల్‌ రాఫెల్‌ మారియానో గ్రోసీ హెచ్చరించారు. వాటివద్ద పరిస్థితి ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నట్టు ఉక్రెయిన్‌ నుంచి తమకు సమాచారముందని చెప్పారు. ఉక్రెయిన్‌లో నాలుగు అణు విద్యుత్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటిలోని 15 రియాక్టర్లు దేశ విద్యుత్‌ అవసరాల్లో సగం మేరకు తీరుస్తున్నాయి.