రష్యాలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలు బంద్

 

 

 

 

 

వాషింగ్టన్‌: అమెరికన్‌ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ (Apple) రష్యాలో తన ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేసిన్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. ‘రష్యాలో అన్ని ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాం. అన్నిరకాల ఎగుమతులను ఆపివేశాం. ఆపిల్‌ పే, ఇతర సేవలపను పరిమితం చేశాం’ అని ఆపిల్ తెలిపింది. అదేవిధంగా రష్యాపై పలు ఆంక్షలు కూడా విధించింది. ఉక్రెయిన్‌ పౌరుల భద్రత కోసం యాపిల్‌ ఫోన్లలో లైవ్‌ మ్యాప్‌లు కనిపించకుండా చేయడంతోపాటు అక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించిన వార్తలను నిలిపివేసింది.

ఇప్పటికే ఫేస్‌బుక్‌, ట్విటర్‌, గూగుల్‌ వంటి సామాజిక మాధ్యమాలు తమ ప్లాట్‌ఫామ్స్‌లో రష్యా దాడికి సంబంధించిన సమాచారాన్ని తొలగించాయి. ఆన్‌లైన్‌ వీడియో ప్లాట్‌ఫామ్‌ అయిన యూట్యూబ్‌ కూడా రష్యాకు చెందిన ఆర్టీ న్యూస్‌పై నిషేధం విధించింది.

ఉక్రెయిన్ దేశంపై రష్యా సైనిక దాడి చేసినప్పటి నుంచి అమెరికా నేతృత్వంలోని పలు దేశాలు మాస్కోపై పలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్ తమ గగనతలంపై రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించింది.

కాగా, ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యా ఆర్థిక పరమైన ఆంక్షలతోపాటు దౌత్యపరంగా కూడా ఒత్తిడి తీసుకొస్తున్నాయి. కెనడా, స్వీడన్‌తోపాటు యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తమ గగనతలంపైనుంచి రష్యా విమానాలు వెళ్లకుండా ఆంక్షలు విధించాయి. తాజాగా అమెరికా కూడా ఈ జాబితాలో చేరింది. అదేవిధంగా అమెరికా, కెనడాలోని పలు రాష్ట్రాలు రష్యా ఉత్పత్తులు, రష్యన్‌ బేవరెజెస్‌ను బ్యాన్‌ చేశాయి. తమ స్టోర్లలో రష్యన్‌ వొడ్కాను అమ్మేది లేదని తేల్చిచెప్పాయి.