రష్యా ఊహకు అందనంతగా ప్రతిఘటన
బుధవారం 2`3`2022
ఉక్రెయిన్‌పై దాడి ఇంత భయంకరంగా ఉంటుందని బహుషా రష్యా కూడా ఊహించి ఉండదు. ఒకటి రెండురోజుల్లో సునాయాసంగా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవచ్చన్న పుతిన్ అంచనాలు తలకిందుల య్యాయి. వరుసగా ఏడు రోజుల తరవాత కూడా ఉక్రెయిన్ ఎదురుదాడి చేస్తూనే ఉంది. రష్యా సైనికులు వేలల్లో మరణిస్తున్నారు. ఈ క్రమంలో మెల్లగా ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. అలాగే సైనిక సాయం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. పరిస్థితులు చేజారుతాయన్న భయంతో ఆయా దేశాలు కొంత వెనకడుగు వేస్తున్నాయి. లేకపోతే ఈ పాటికి ఉక్రెయిన్‌కు మద్దతుగా అనేక దేశాలు యుద్దరంగంలోకి దిగేవే. అలాగే ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలవుతోంది. అణుబాంబు బూచి చూపుతున్న పుతిన్ ..ప్రపంచంలో తన ప్రతిభను పూర్తిగా కోల్పోయారు. ఆయా దేశాలు ఇప్పుడు పుతిన్‌ను చూసి ఏవగించుకుంటున్నాయి. పుతిన్ కూడా బహుశా యుద్దం ఇంత దారుణంగా ఉంటుందని ఊహించి ఉండరు. ఒకటి రెండు రోజుల్లో ఉక్రెయిన్ దారికి వస్తుందని కదనరంగంలోకి దిగి ఉంటారు. కాకపోతే అంత ఈజీ కాదని ఇప్పుడు తెలిసి ఉంటుంది. మరోవైపు తమ లక్ష్యం పూర్తయ్యేదాకా సైనిక ఆపరేషన్ కొనసాగుతుందని రష్యా ప్రకటించింది. మరో వైపు యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వం కోసం ఉక్రెయిన్ చేసిన అభ్యర్థనను ఇయు ఆమోదించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇయు పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ, తమను ఒంటరి చేయొద్దని వేడుకున్నారు. ఉక్రెయిన్‌కు ఇయు సాయం కావాలని కోరారు. పశ్చిమ దేశాల వంచన పూరిత ఎత్తుగడలను ఒకవైపు రష్యా ఎత్తిచూపుతున్నా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వైఖరిలో మార్పు రావడం లేదు. యూరోపియన్ యూనియన్ దేశాల మద్దతు లేకుండా తాము లేమని ఆయన ప్రకటించుకున్నారు. మంగళవారం ఇయు పార్లమెంటును ఉద్దేశించి వీడియో లింక్ ద్వారా జెలెన్‌స్కీ ప్రసంగించారు. ఇయు లేకపోతే ఉక్రెయిన్ ఒంటరిగా మిగిలి పోతుంది. విూరు మాతో ఉన్నట్టు నిర్దారించే చర్యలు చేపట్టండి. మమ్మల్ని ఒంటరిగా వదిలేయబోమని ధ్రువీకరించండి. మరణంపై జీవం, చీకటిపై వెలుగు విజయం సాధిస్తాయన్న విషయాన్ని ఐరోపియన్లుగా రుజువు చేయండి. ఉక్రెయిన్ వైభవాన్ని కాపాడండని ఆయన కోరారు. మరో వైపు రెండవ దఫా శాంతి చర్చలు గురువారం నిర్వహించేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు సిద్ధమవుతున్నారు. అణు యుద్ధం వచ్చే ప్రమాదముందని, దీనిని ఎదుర్కొనేందుకు అణు దళాలు అప్రమత్తంగా ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఇకపోతే పుతిన్ మరింత పట్టుదలగా ఉక్రెయిన్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. పౌరులు చనిపోతున్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. 40 మైళ్ల పొడవునా రష్యన్ యుద్ధట్యాంకులతో కూడిన భారీ వాహన శ్రేణి ఖర్కివ్‌కు ఉత్తర దిశగా దూసుకొస్తున్నట్టు శాటిలైట్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రష్యన్ బలగాలే ఈ క్షిపణి దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ప్రకటిం చింది. అందుకే ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునే క్రమంలో వరుస రాకెట్ దాడులు, పేలుళ్లతో ఉక్రెయిన్ రగులుతోంది. పశ్చిమ దేశాల నుంచి పొంచివున్న ప్రమాదాలను తిప్పికొట్టే క్రమంలో తనను తాను రక్షించుకునేందుకు అవసరమైన ప్రధాన లక్ష్యాన్ని చేరుకునేవరకూ ఉక్రెయిన్‌లో చేపట్టిన ప్రత్యేక సైనిక ఆపరేషన్ కొనసాగుతుందని రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్జారు షోయిగు తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి పొంచివున్న సైనిక పరమైన ముప్పు నుంచి రక్షించు కోవడమే రష్యా ముందున్న ప్రధానలక్ష్యం. మా దేశంపై పోరాడేందుకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ ప్రజానీకాన్ని పావుగా వాడుకోవాలని చూస్తున్నాయి. ఈ దుర్మార్గాన్ని సహించం. ఈ ముప్పును తిప్పికొట్టేదాకా ఆపరేషన్ కొనసాగుతుందని షోయిగు తెలిపారు.