రష్యా కంబంధ హస్తాల్లో జర్మనీ చిక్కుకుంది
– నాటో దేశాలు తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలి
– అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
బ్రిసెల్స్, జులై11(జనం సాక్షి) : నాటో సంకీర్ణ దేశాలకు డోనాల్డ్ ట్రంప్ మరో షాకిచ్చారు. ఆ కూటమి నుంచి తప్పుకుంటామంటూ ఇటీవల వ్యాఖ్యానించిన ఆయన బుధవారం తాజాగా మరో ఆరోపణ చేశారు. నాటో దేశాల సదస్సులో పాల్గొనేందుకు బ్రసెల్స్‌కు వచ్చిన ఆయన ఓ ఘాటైన కామెంట్ చేశారు. నాటోలో కీలక దేశమైన జర్మనీ.. రష్యాతో స్నేహసంబంధంగా మెలుగుతోందన్నారు. రష్యా నుంచి జర్మనీ బిలియన్ల డాలర్ల ఖరీదైన ఇంధనాన్ని ఖరీదు చేస్తోందని ఆరోపించారు. ఒకప్పటి సోవియట్ యూనియన్‌ను ఎదుర్కొనేందుకు అమెరికాతో పాటు కొన్ని యురోపియన్ దేశాలు నాటో మిలిటరీ దళాన్ని ఏర్పాటు చేశాయి. నాటోను నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్‌గా పిలుస్తారు. చాన్నాళ్లుగా నాటో సంకీర్ణ దళాలు అనేక యుద్ధాల్లో పాల్గొన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాల్లో ఈ దళాలు కీలక పాత్ర పోషించాయి. మొత్తం 29 దేశాలు నాటోలో సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే ఆ దేశాలు తమ డిఫెన్స్ బడ్జెట్‌లో నాటో కోసం కోటా కేటాయించడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు. నాటో దేశాలు తమ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు. కానీ మరోవైపు నాటో దేశాలు మాత్రం ట్రంప్ వాదనను తోసిపుచ్చుతున్నాయి. ప్రతి ఏడాది నాటో సంకీర్ణ దళాల కోసం తమ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు ఆ దేశాలు అంటున్నాయి. అమెరికానే ఆ అంశాన్ని విస్మరిస్తోందని నాటో దళాలు ఆరోపిస్తున్నాయి. రష్యా కబంధహస్తాల్లో జర్మనీ చిక్కుకుందని ట్రంప్ బుధవారం చేసిన కీలక వ్యాఖ్యలు నాటో దేశాల్లో కొత్త కలవరానికి దారితీస్తున్నాయి. నాటో జనరల్ సెక్రటరీ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌తో సమావేశమైన తర్వాత ఆయన ఈ కామెంట్ చేశారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరుగుతున్న నాటో భేటీకి వచ్చిన ట్రంప్.. జర్మనీ చర్యలు సరిగా లేని అన్నారు. రష్యాను నిలువరించేందుకు అమెరికా సంసిద్ధమై ఉన్నట్లు కూడా ట్రంప్ తెలిపారు. కానీ రష్యాకు బిలియన్ల డాలర్లు చెల్లిస్తున్న జర్మనీ గురించి నాటో దేశాలు ఆలోచించాలని ట్రంప్ సూచించారు. అయితే సభ్య దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా.. సంకీర్ణ దళాలు ఒక్కటిగానే ఉన్నట్లు స్టోల్టెన్‌బర్గ్ అన్నారు. రష్యాను సంపన్న దేశంగా మారుస్తున్న జర్మనీకి ఎలా మద్దతు ఇస్తామని కూడా ట్రంప్ ప్రశ్నించారు. కానీ మరో షాకింగ్ అంశమేంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ భేటీకానున్నారు. సోమవారం రోజున హెల్సిన్కీలో ఈ సమావేశం జరగనున్నది. రష్యాపై పరోక్షంగా ఆరోపణలు చేస్తూనే ట్రంప్ ఆ దేశాధ్యక్షుడిని కలుసుకోబోవడం నాటో దళాలను అయోమయంలోకి నెట్టేస్తోంది. బ్రసెల్స్ సమావేశం
తర్వాత ట్రంప్ లండన్ వెళ్లనున్నారు. అక్కడ నాలుగు రోజులు ఆయన బస చేయనున్నారు. ఆ తర్వాత హెల్సిన్కీకి వెళ్తారు.