రష్యా చేరుకున్న ప్రధాని మోదీ

4

మాస్కో, జులై 8 (జనంసాక్షి):

కజకిస్తాన్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడి నుంచి మాస్కో బయలుదేరి వెళ్లారు.కజకిస్తాన్‌ నుంచి ప్రధాని మోదీ బుధవారం రష్యా చేరుకోనున్నారు. అక్కడ ఆయన బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశమవుతారు. అంతకుముందు నజర్‌బయేవ్‌ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత్‌, మధ్య ఆసియా దేశాల మధ్య ఉన్న బంధాల్లో మార్పు తీసుకువచ్చేందుకు తాను ఐదు దేశాల్లో పర్యటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌ పెట్టుకున్న అభ్యర్థనకు కజకిస్తాన్‌ పూర్తి సహకారం అందించిందని మోదీ గుర్తు చేశారు. కజకిస్తాన్‌ తరహాలోనే మధ్య ఆసియా దేశాలు పురోగమిస్తున్నాయని ఆయన అన్నారు. ఆసియా దేశాల మధ్య పరస్పర సహకారం మరింత అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఆసియా దేశాల్లో ఒకరిపై ఒకరికి ప్రత్యేక అభిమానం ఉందని మోదీ వ్యాఖ్యానించారు. కానీ గతంలో ఎన్నడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదని అన్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి మారుతుందని, అందుకే మా ప్రభుత్వం తొలి రోజుల్లోనే మధ్య ఆసియాలో ఐదు దేశాల్లో పర్యటిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. పరస్పర సహకారం లేకుండా భారత్‌, మధ్య ఆసియా దేశాల మధ్య పూర్తి స్థాయి సామర్థ్యం పెరగదని ఆయన అభిప్రాయపడ్డారు. కోట్ల సంఖ్యలో ఉన్న యువతే…భారత దేశ పురోగాభివృద్ధికి శక్తి అని ఆయన అభివర్ణించారు.  రష్యా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించనున్నట్లు సమాచారం. 2014 మే తర్వాత ఇరు దేశాల ప్రధానులు బద్కటీ కావడం ఇదే తొలిసారి.