రసాయన ఎరువుల వాడకం తగ్గించండి

5

– సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించండి

– సమీక్షలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి):  పంటల సాగులో రసాయన, క్రిమిసంహారక మందుల వాడకం తగ్గాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. సేంద్రియ వ్యవసాయానికి ప్రోత్సాహం పెంచాల్సి ఉందన్నారు. అలాగే రైతులను సేంద్రియం వైపు మళ్లించాలని అన్నారు. శనివారం ఆయన ఉద్యానవనశాఖపై ఉన్నతస్థాయి సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఏది తినాలన్నా ప్రజలు కల్తీ వల్ల భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. కల్తీలేని వస్తువులు దొరకడం కష్టతరంగా మారుతోందని, రసాయన ఎరువుల వాడకం తగ్గించేలా రైతుల్లో చైతన్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రంలో పూలసాగుపై ఉద్యానశాఖ ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.క్యాంపు కార్యాలయంలో ఉద్యానవన శాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంబంధిత అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలను కల్తీ నుంచి కాపాడేందుకు ఉద్యానవన శాఖ క్రియాశీలకం కావాలన్నారు. పండ్లు, కూరగాయాలు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిలతో పాటు ప్రతిదీ కల్తీ అవుతుందన్నారు. కల్తీ లేని వస్తువు లేకుండా పోయింది.. ఏది తిన్నాలన్నా భయపడే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. భయానక పరిస్థితి నుంచి బయటపడేలా ఉద్యానవన శాఖ తయారు అవాలని చెప్పారు. రసాయనాలు ఎక్కువగా వాడని కూరగాయాలు, పండ్లు, కల్తీ లేని మసాలాలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరాలకు సరిపడా పండ్లు, కూరగాయాలు, మసాలాలు, పూలు  రాష్ట్రంలోనే ఉత్పత్తి అయ్యేందుకు అవసరమైన వ్యూహాన్ని రూపొందించాలన్నారు. ఉద్యానవన శాఖలో మార్కెటింగ్‌, పుడ్‌ ప్రాసెసింగ్‌, మెకనైజేషన్‌ విభాగాలు ఏర్పాటు చేసి అదనపు సంచాలకులను నియమించాలని ఆదేశించారు.  సమావేశంలో మంత్రులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.