రహానె లేకపోవడం కఠిన నిర్ణయమే..!

– భారత మాజీ సారథి సౌరభ్‌ గంగూలి
బెంగళూరు, మే9(జ‌నం సాక్షి) : ఐపీఎల్‌ అనంతరం టీమ్‌ ఇండియా.. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌, అఎ/-గానిస్థాన్‌తో ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీసీసీఐ ఈ సిరీస్‌కు సంబంధించి మంగళవారం జట్టుకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాను వెల్లడించింది. ఐపీఎల్‌లో విశేషంగా రాణిస్తున్న అంబటి రాయుడు, కేఎల్‌ రాహుల్‌, కరుణ్‌ నాయర్‌, సిద్దార్థ్‌ కౌల్‌.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఇక వచ్చే నెల జూన్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడనున్న ఏకైక టెస్ట్‌కు అజింక్య రహానె నాయకత్వం వహించనున్నాడు. అయితే రహానెను కేవలం టెస్ట్‌ మ్యాచ్‌కు పరిమితం చేసి ఇంగ్లాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని భారత మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ పేర్కొన్నాడు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం ఎంతో కఠినమైనదని అభివర్ణించాడు. నేనైతే ‘అంబటి రాయుడు స్థానంలో అజింక్య రహానెను ఇంగ్లాండ్‌ పర్యటనకు ఎంచుకుంటాను. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై రహానెకు మంచి రికార్డు ఉంది. విదేశీ గడ్డపై అతను ఎప్పుడూ అత్యుత్తమ ఆటగాడే. అతనిని పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఎంపిక చేయకపోవడం కఠిన నిర్ణయమే’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. మరోవైపు ఇదే ఇంగ్లాండ్‌ సిరీస్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికను గంగూలీ సమర్థించాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నైకు ఆడుతున్న రాయుడు మొత్తం ఆడిన 10మ్యాచ్‌లలో 423పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
మరోవైపు రాజస్థాన్‌ రాయల్స్‌ సారథ్యం వహిస్తున్న రహానె ఈ సీజనులో నామమాత్రంగా రాణిస్తున్నాడు. ఇక అంతర్జాతీయ వన్డేల్లోనూ 90మ్యాచ్‌లాడిన రహానె 35సగటుతో 2962పరుగులు చేశాడు.
——————————–