రాజకీయాలకు సోనియా గుడ్ బై!

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సంచలన ప్రకటన చేశారు. 19 ఏళ్లుగా ఆ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా.. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. సోనియా కుమారుడు రాహుల్‌గాంధీ ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శనివారం ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సోనియా కీలక ప్రకటన చేయడం జాతీయ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.

ఈరోజు ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలకు సోనియాగాంధీ హాజరయ్యారు. సభ వాయిదా అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘రాహుల్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?’ అని ఓ విలేకరి సోనియాను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అని ప్రకటించారు.

ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 19ఏళ్ల పాటు పార్టీ అధినేత్రిగా కొనసాగిన సోనియా పార్టీని కుమారుడి చేతుల్లో పెట్టనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ తర్వాత పూర్తిస్థాయి అధ్యక్షుడిగా రాహుల్‌ కొనసాగనున్నారు. సోనియా ఇటీవల తరుచూ అనారోగ్యానికి గురవుతున్నారు. క్యాన్సర్‌కు సంబంధించి చికిత్స పొందుతున్నారు. చికిత్స నిమిత్తం ఇటీవల అమెరికా కూడా వెళ్లి వచ్చారు. రాహుల్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించాలని కొంతకాలంగా సోనియా భావిస్తున్నారు. ఇన్నాళ్లకు ఆమె కల నెరవేరడంతో ఇక రాజకీయాలకు స్వస్తి చెప్పాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.