రాజకీయాల్లోకి రావట్లేదు
– రజనీకాంత్ ప్రకటన
చెన్నై,డిసెంబరు 29 (జనంసాక్షి):తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన రాజకీయ అరంగేట్రంపై సంచలన ప్రకటన చేశారు. అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ పెట్టట్లేదని తలైవా నేడు స్పష్టం చేశారు. అయితే రాజకీయాలతో సంబంధం లేకుండా తన ప్రజాసేవ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా అభిమానులకు మూడు పేజీల లేఖ విడుదల చేశారు. ఆత్మీయుల సూచనతో..’ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో పార్టీ ప్రారంభించకూడదని నిర్ణయించుకున్నా. ఆరోగ్యం ప్రాధాన్యమని ఆత్మీయులు సూచించారు. ఎంతో భారమైన హృదయంతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నా. ఇటీవల అనారోగ్య బారినపడటాన్ని దేవుడి సూచనగా భావిస్తున్నా. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటీవల 120 మంది ఉన్న మా చిత్రబృందంలో కొందరు కరోనాకు గురయ్యారు. అలాంటిది నేను ఎన్నికల బరిలోకి దిగితే లక్షల మంది జనం మధ్యలోకి వెళ్లాలి. ప్రస్తుతం నా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా నేను సాహసం చేయలేను. ప్రజలను ఇబ్బందుల్లో పెట్టలేను. కేవలం సోషల్‌విూడియా ప్రచారంతో ఏ పార్టీ కూడా గెలువలేదు. అయితే నిజం మాట్లాడటానికి ఎప్పుడూ వెనుకాడను. రాజకీయాలతో సంబంధం లేకుండా నా ప్రజాసేవ నిరంతరం సాగుతోంది’ అని రజనీ లేఖలో పేర్కొన్నారు. తన నిర్ణయం అభిమానులను విపరీతంగా బాధపెట్టి ఉండొచ్చని, అందుకు తాను క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు. ఇటీవల రజనీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. అధిక రక్తపోటు కారణంగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన ఆయన.. రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. గత శనివారం చెన్నై చేరుకున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతానికి కొద్ది రోజులు రాజకీయాలకు దూరంగా ఉండాలని కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాజకీయాలు, పార్టీ పనులు అంటూ నిత్యం అవే ఆలోచనల్లో ఉంటుండం వల్లే మానసిక ఒత్తిడి పెరుగుతోందని, అందుకే కొద్ది రోజుల పాటు వీటన్నింటికీ దూరంగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రజనీ పార్టీ పెట్టట్లేదంటూ నేడు సంచలన ప్రకటన చేశారు. ఏళ్ల తరబడి ఎదురుచూపులకు తెరదించుతూ వచ్చే ఏడాది రాజకీయాల్లోకి వస్తున్నానంటూ తలైవా డిసెంబరు మొదటివారంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న వెల్లడిస్తానని చెప్పారు. ‘త్వరలో అద్భుతాలు.. ఆశ్చర్యాలు జరుగుతాయి. మారుస్తాం.. అన్నింటినీ మారుస్తాం. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ జరగదు’ అని రజనీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజులకు ‘మక్కల్ సేవై కట్చి’ పేరుతో తలైవా ఎన్నికల సంఘంలో పార్టీని నమోదు చేసినట్లు, ఆయనకు ఆటో గుర్తు కేటాయించినట్లు కూడా వార్తలు చక్కర్లు కొట్టాయి. అంతేగాక, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో రజనీ పార్టీ పోటీకి దిగుతుందనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో తమిళనాట ఆయన అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. అయితే అకస్మాత్తుగా రజనీ ఇటీవల అనారోగ్యానికి గురవడంతో ఆయన రాజకీయ ఆగమనంపై మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. తన తదుపరి చిత్రం ‘అన్నాతై’ షూటింగ్ నిమిత్తం కొద్ది రోజుల క్రితం రజనీ హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో రక్తపోటు హెచ్చుతగ్గుల కారణంగా ఆసుపత్రిలో చేరిన ఆయన గతవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆలోచనను విరమించుకుంటున్నట్లు తలైవా నేడు ప్రకటించారు. దీంతో అభిమానులకు మళ్లీ నిరాశ తప్పట్లేదు..!