రాజకీయాల్లో అస్పృష్యతలుండవు
– గిరిధారిలాల్ డోగ్రా శతజయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ
జమ్ము,జులై17(జనంసాక్షి):రాజకీయాల్లో అస్పృష్యతలుండవని ప్రధాని నరేంధ్రమోడి అన్నారు.శుక్రవారం జమ్ము విశ్వవిద్యాలయంలో జరుగుతున్న గిరిధారిలాల్ డోగ్రా శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. డబ్బు, అధికారాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి గిరిధారి లాల్ డోగ్రా అని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సేవలు నిత్యం అనుసరణీయమని, శరోధార్యమని అన్నారు. తొలుత డోగ్రాకు నివాళులు అర్పించిన మోదీ అనంతరం కీలక ప్రసంగం చేశారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్థిక మంత్రిగా పనిచేసిన డోగ్రా ఎదుట వారిని అంచనా వేయడంలో ప్రావీణ్యంగల వ్యక్తి అని కొనియాడారు. అందుకే తన అల్లుడిగా ఇప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఎన్నుకోగలిగారని ప్రశంసించారు. అలా కాకపోయి ఉంటే నేటి ‘రాజకీయ అల్లుళ్ల’ సంగతి చెప్పనక్కర్లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడైన రాబర్ట్ వాద్రాని ఉద్దేశించి చురకలంటించారు. అందుకే ప్రస్తుత తరం నాయకులకు గిరిధరిలాల్ డోగ్రా ఆదర్శంగా నిలిచారని ప్రధానమంత్రి అన్నారు. కొందరు నేతలు మరణించినా వారిని మర్చిపోలేం. స్వాతంత్య ఉద్యమంలో డోగ్రా పాత్ర కీలకం. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేశారు. తన త్యాగాలతో ఎందరో నేతలకు డోగ్రా స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాశ్మీర్ సిఎం ముఫ్తీ మహ్మద్ సయీద్, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు.