రాజకీయాల్లో కొట్టుకుపోయిన శారదా కుంభకోణం 

పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంలో నష్టపోయిన వారికి, మోసపోయిన వారికి న్యాయం జరగడం మాటెల ఉన్నా అది రాజకీయ రచ్చకు దారితీసింది. తనకుతాను భావి ప్రధానిగా ఊహించుకుని ప్రచారం చేస్తున్న మమతా బెనర్జీ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిన నేతలు అవినీతి కూపంలో ఉన్నారనడానికి ఇదో ఉదాహరణగా చూడాలి. కోట్ల రూపాయలను మెక్కేసిన నేతలు నింపాదిగా ఉన్నారు. నష్టపోయిన ప్రజలు మాత్రం రోడ్డున పడ్డారు. ఈ వ్వయహారంలో మమత తీరు కూడా నిష్పక్షపాతంగా లేదు. దోషులను శిక్షించాలన్న పట్టుదల కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అందులో ఉన్నవారంతా ఆమె అనుయాయులు, తృణమూల్‌ నేతలే కావడం. అందుకే మమత సిబిఐ విచారణకు అంగీకరించక పోవడం,పోనీ రాష్ట్రంలోనే విచారణ జరిపి దోషులకు శిక్షపడేలా చేయడంలోనూ మమతా బెనర్జీ విఫల మయ్యారు. ఈ కుంభకోణంలో కిందినుంచి పైదాకా తృణమూల్‌ నేతలే ఉండడం దీనికి కారణంగా చెప్పు కోవాలి. అందుకే సిబిఐ దర్యాప్తును పర్యవేక్షించాలన్న దానిపై పై సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది.  శారదా కుంభకోణం కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేపడుతోన్న దర్యాప్తును పర్యవే క్షించడానికి సుప్రీం కోర్టు అంగీకరించలేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుందని సుప్రీం 2013లోనే స్పష్టం చేసింది. అయితే తాజాగా కొందరు ఇన్వెస్టర్లు సీబీఐ విచారణను పర్యవేక్షించాలంటూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ విచారణను పర్యవేక్షించడానికి ఎటువంటి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయం అని ధర్మాసనం పేర్కొంది. ఇటీవల కాలంలో చోటు చేసుకున్న అనేక పరిణామాల వల్ల సీబీఐ తన ప్రతిష్ఠను పూర్తిగా కోల్పోయింది. ఫలితంగా కోల్‌కతాలో సీబీఐ అధికారులను మమతా బెనర్జీ తన పోలీసుల తో నిర్బంధించగా, ఆమె తప్పు చేశారని సర్వోన్నత న్యాయస్థానం కూడా గట్టిగా చెప్పలేక పోయింది.  భారతీయ జనతా పార్టీ నాయకులపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఏ దర్యాప్తు సంస్థ కూడా వారివైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలను ఇప్పుడు తెరపైకి తెచ్చారు. అదే ప్రతిపక్షాల విషయానికి వస్తే బూజు పట్టిన కేసులను సైతం దులిపి విచారణను వేగవంతం చేస్తున్నారని, దానికి శారదా కుంభ కోణమే నిదర్శనమని తృణమూల్‌ నేతలు ఆరోపిస్తున్నారు.  శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కూడా ఈ కోవలోకే వస్తుంది. మమతా బెనర్జీ ఇటీవలి కాలంలో నరేంద్ర మోదీకి కంటిలో నలుసులా మారారు. కాంగ్రెస్‌ నుంచి విడిపోయిన మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో బలమైన నాయకురాలిగా ఎదిగారు. సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేసి సొంతంగా ఏర్పాటుచేసుకున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ను అధికారం లోకి తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి అప్పటివరకు అధికారంలో ఉన్న వామపక్ష నాయకులకు కంటి విూద కునుకు లేకుండా చేశారు. దీంతో పశ్చిమ బెంగాల్‌లో వామపక్షాలు బలహీనపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ కూడా మమతా బెనర్జీ నిష్కమ్రణతో ఆ రాష్ట్రంలో బలహీనపడింది. ఈ దశలో బెంగాల్లో కాలుమోపాలని చూస్తున్న  బిజెపి ప్రబుత్వం శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు. రాజకీయ ప్రత్యర్థులను కేసులలో ఇరికించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ దూకుడు శ్రుతిమించుతూ ఉండటంతో ప్రత్యర్థులు కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ కూడా నరేంద్ర మోదీతో నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో ఢీకొంటున్నారు. ఇటీవలి ఘటనలే ఇందుకు నిదర్వనంగా చూడాలి.భారతీయ జనతా పార్టీ పంచన చేరినవారు మాత్రమే ఈ దేశంలో
నీతిమంతులు, మిగతా పార్టీలలో ఉన్నవారంతా అవినీతిపరులే అన్న భావన ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షాలల్లో ఏర్పడింది.అందుకే ప్రతిపక్షాల నాయకులను లూటీదార్లు అని నిందిస్తుంటారు. శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు కొందరు బీజేపీలో చేరగానే వారిని విచారించే పనిని సీబీఐ మరిచిపోయింది. ఎన్నికల తర్వాత ప్రధాన మంత్రి కావాలన్న ఆశతో ఉన్న మమతా బెనర్జీ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కోల్‌కతాకు ఆహ్వానించి భారీ ర్యాలీని నిర్వహించారు. తన అధికారానికే సవాలుగా మమతా బెనర్జీ మారడంతో సహించలేక పోయిన ప్రధాని మోదీ,శారదా కేసులో  సీబీఐని ఉసిగొల్పారు. దీంతో మమతా బెనర్జీ కూడా అసాధారణ రీతిలో రాష్ట్ర పోలీసులను ప్రయోగించి సీబీఐ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అంతటితో ఆగకుండా దీక్షకు దిగారు. దీంతో పశ్చిమ బెంగాల్‌ రాజకీయం వేడెక్కింది. ఇటు ప్రధాని మోదీ, అటు మమతా బెనర్జీ కూడా ఇదంతా లోక్‌సభ ఎన్నికలలో విజయం కోసం మాత్రమే చేస్తున్నరన్నది స్పష్టం. దీంతో శారదా కుంభకోణంలో డబ్బు పోగొట్టుకున్న వేలాది మందికి ఒరిగేదవిూ లేదు. సిబిఐ కూడా 2013 నుంచి ఏం చేస్తున్నదో తెలియదు. ఒకవేళ విచారణ ఏయాల్సి వస్తే దానికో పద్దతి ఉంటుందని గమనించ నంతగా వ్యవహారం చేసింది. మొత్తంగా ఇప్పుడు బెంగాల్లో మమత వర్సెస్‌ పరధాని మోడీ అన్న తీరుగా వ్యవహారాలను తీసుకుని వచ్చారు. కుంభకోణం వెనక్కి పోయింది. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మన వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి. బెంగాల్లో రాజకీయాలకు శారదా కుంభకోణం మరుగున పడిపోయిందన్నది కనిపిస్తున్న సత్యం.