రాజకీయ ఫ్రంట్‌ ఏర్పాటుపై నేడు చర్చ: తమ్మినేని

హైదరాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి):  రాజకీయాల్లో నైతికత కొరవడిందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని అన్నారు. ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమయ్యిందననారు. సామాజిక న్యాయ సాధనకోసం రాజకీయ ఫ్రంట్‌ అవసరమని, దీనికోసం పలు సంఘాలు, సామాజిక శక్తులతో చర్చలు జరుపుతున్నామన్నారు. రాజకీయ ఫ్రంట్‌పై ఈ నెల 19న ఆదివారం  రాజకీయ పార్టీలతో కలిసి సమావేశం నిర్వహిస్తున్నామంటున్న సీపీఎం కార్యదర్శి తమ్మినేని తెలిపారు.
కేటీపీఎస్‌లో సుమారు 350 మంది కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విలీనం చేయకపోగా తొలగించే పక్రియ చేపట్టడం ఏంటని అధికారులపై మండిపడ్డారు.
నిజాం రాజును పొగుడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగంపై  తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.  ఎన్నికలు దగ్గర పడటంతో మత ప్రాతిపదికన ఓట్లు దండుకోవడానికి, ఎంఐఎంను మచ్చిక చేసుకోవడానికి ‘నిజాం మన రాజు, చరిత్ర, ఘనత’ అని కేసీఆర్‌ కీర్తిస్తున్నారని  తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఒక వ్యక్తికో, మతానికో వ్యతిరేకంగా జరిగిన పోరాటం కాదని తెలిపారు. నిజాం తన అధికారాన్ని పదిలపర్చుకోవడానికి రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించారని, నిజాం వ్యతిరేక పోరాటంలో 4 వేల మంది ప్రాణాలర్పించారని గుర్తు చేశారు. ఈ రాచరిక పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో ముస్లిం మైనారిటీలు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారని పేర్కొన్నారు. చరిత్రను మరచి సిఎం కెసిఆర్‌ చేస్తున్న ప్రకటనలు కేవలం ఓట్ల కోసమే అన్నది ప్రజలకు తెలుసన్నారు.