రాజకీయ మూల్యం చెల్లించడానికి సిద్ధమే

– బినావిూదారులపై ఆధార్‌ ఆయుధంగా పనిచేస్తుంది
– నోట్లరద్దుతో నల్లధనాన్ని తరిమేస్తున్నాం
– లీడర్‌షిప్‌ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ
న్యూఢిల్లీ, నవంబర్‌30(జ‌నంసాక్షి): భారత ప్రగతికోసం కొత్త విధానాలు తీసుకొస్తూనే ఉంటానని.. అవసరమైతే వాటికి ‘రాజకీయ మూల్యం’ చెల్లించడానికి కూడా తాను సిద్ధమేనని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టంచేశారు. ఢిల్లీలో హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి హాజరైన మోదీ.. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా బదులిచ్చారు. తన నిర్ణయాల వల్ల తనకు ఎటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వచ్చినా దాన్ని స్వీకరిస్తానని, రాజకీయంగా తన భవిష్యత్తును త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని తెలిపారు. అత్యుత్తమ భారత్‌ కోసం తన లక్ష్యాలను వదిలే ప్రసక్తే లేదని మోదీ అన్నారు.  రెండేళ్ల క్రితం తాను ఈ సదస్సుకు వచ్చినప్పుడు ప్రకాశవంతమైన భారత్‌  దిశగా అనే అంశంపై సదస్సులో పాల్గొన్నానని.. ప్రస్తుతం రెండేళ్లలోనే తిరుగులేని పెరుగుదల అనే అంశంపై చర్చించుకుంటున్నామన్నారు.అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టంచేశారు.  అవినీతి రహిత పౌర సేవకు తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. నోట్లరద్దుకు ముందు నల్ల ధనం ఓసమాంతర ఆర్థిక వ్యవస్థగా కొనసాగిందని, కానీ ఇప్పుడు నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం దేశఆర్థిక వ్యవస్థలో కలిసిపోయిందన్నారు. నోట్ల రద్దు తర్వాత సేకరించిన డేటా ఆధారంగా అవినీతికి పాల్పడిన వారి వివరాలు బయటకు వస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఆధార్‌ వ్యవస్థను కూడా మోదీ మెచ్చుకున్నారు. మొబైల్‌, జన్‌ధన్‌ అకౌంట్లకు ఆధార్‌ను అనుసంధానించడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చినట్లు ప్రధాని చెప్పారు. ఆధార్‌తో బినావిూ వ్యవస్థను కూకటివేళ్లతో పెకులించవచ్చు అని మోదీ అన్నారు. నోట్ల రద్దు తరువాత భారతీయల వైఖరిలో చాలా మార్పు వచ్చిందని, ఆ పక్రియ ద్వారా స్వచ్ఛమైన, శుద్ధమైన ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందన్నారు. స్వాతంత్యం/-ర వచ్చిన తర్వాత మొదటిసారి నల్లధనం కలిగిన వ్యక్తులు భయపడుతున్నారని మోదీ అన్నారు. ఆధార్‌తో సామాన్య ప్రజల హక్కులను కాపాడవచ్చు అని తెలిపారు.