రాజకీయ లబ్ది కోసం మేం మహిళా రిజర్వేషన్‌ బిల్లు తేలేదు ` అమిత్‌షా


దిల్లీ: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల అంశం తమ పార్టీకి రాజకీయ ఎజెండా కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాపేర్కొన్నారు. నారీ శక్తి వందన్‌ అధినియమ్‌ 2023 బిల్లుపై లోక్‌సభలో ప్రసంగించిన ఆయన.. మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయాంశమని అన్నారు. 2024 ఎన్నికలు ముగిసిన వెంటనే, జనగణన, డీలిమిటేషన్‌ ప్రక్రియ మొదలుపెడతామని అమిత్‌ షా స్పష్టం చేశారు.‘మహిళలకు రిజర్వేషన్ల కల్పనతో ఏళ్ల తరబడి నిరీక్షణకు తెరపడనుంది. మహిళా సాధికారత అనేది కొన్ని పార్టీలకు రాజకీయ ఎజెండా. ఎన్నికల్లో గెలవడానికి దీన్ని కొన్ని పార్టీలు రాజకీయ అస్త్రంగా వాడుకుంటాయి. భాజపా, మోదీకి మాత్రం ఈ బిల్లు రాజకీయ అంశం కాదు. విధాన నిర్ణయాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. ఈ బిల్లును గతంలో నాలుగుసార్లు తెచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. దేవేగౌడ హయాంలోనూ మహిళా రిజర్వేషన్‌ బిల్లు తెరపైకి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ విపక్షంలో ఉంది. ప్రధాని మోదీ కృషితోనే ఈ బిల్లు సాధ్యమయ్యింది. మహిళల ఎన్నో ఏళ్ల పోరాటం ఫలించింది’ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు.