రాజకీయ వ్యూహాల్లో ఉద్దండుడు

et1450tvములాయం సింగ్ యాదవ్..ఉత్తరప్రదేశ్ లో రెండు దశాబ్దాలుగా ఢక్కామొక్కీలు తిన్న నేత ! రాజకీయ ఎత్తుగడల్లో ఆయన నేర్పరి. అప్పటి దాకా వెనుకేసుకు రాగలరు…ఆ వెంటనే తిరస్కరించనూగలరు. రాజకీయాల్లో అనేక అంశాల్లో యూ టర్న్ తీసుకున్న నేతల్లో ములాయంసింగ్ ముందుంటారు. రాష్ట్రపతి అభ్యర్ధి విషయంలో మమతా బెనర్జీకి హ్యాండిచ్చినా…పార్లమెంట్‌లో విపక్షాలకు షాకిచ్చినా…ములాయంకే చెల్లింది. తాజాగా ములాయం మరో యూటర్న్ తీసుకున్నారు. జనతాపరివార్ పెద్దన్నగా చక్రం తిప్పిన ఈ రాజకీయ ఉద్దండుడు… బీహార్ ఎన్నికల్లో పరివార్ కు టాటా చెప్పారు. రాజకీయ వ్యూహాల్లో దిట్ట..సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఎప్పుడు ఎవరికి మద్దతు పడుకుతారో..అంతా సస్పెన్స్. వివిధ సామాజిక వర్గాల ప్రాబల్యం ఉన్న ఉత్తరప్రదేశ్ లో దశాబ్దకాలంగా అధికారంలో ఉన్న ములాయం..జాతీయ రాజకీయాల్లో కూడా కీలక నేతగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన ఎప్పుడు ఎవరితో స్నేహంగా ఉంటారో…ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని భావించే ములాయం, అందివచ్చే ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు. అవసరమైతే…విధానాల్లో రాజీకొస్తారు. పెద్దగా సిద్ధాంత రాద్ధాంతాల జోలికిపోరు. పైచేయి సాధించాలన్న సంకల్పంతో…సందర్భం కోసం ఎదురుచూస్తుంటారు.

ముందు నుంచి బీజేపీ వ్యతిరేక కూటమిలో కొనసాగుతున్న ములాయం…చాలా సందర్భాల్లో మిత్ర పక్షాలకు భారీ షాక్ లు ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీ వ్యతిరేక కూటమి జనతాపరివార్ కు పెద్ద దిక్కుగా ఉన్నారు. రెండు దశాబ్దాల నుంచి పలు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతున్న జనతా పార్టీలను ఒక్క తాటిపైకి తెచ్చి వాటికి నాయకత్వం వహిస్తున్నారు. అయితే జనతా పరివార్ ఏర్పడ్డ తర్వాత జరుతున్న తొలి ఎన్నికల్లో మాత్రం మిత్ర పక్షాలకు మైండ్ బ్లాక్ అయ్యేలా ఝలక్ ఇచ్చారు. బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

మిత్ర పక్షాలకు అనుకోని షాక్ ఇవ్వడం ములాయం కు కొత్తేమీ కాదు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల విషయంలో కూడా తృణముల్ కాంగ్రెస్ కు ములాయం ఇలాగే హ్యండిచ్చారు. కాంగ్రెస్ బలపరుస్తున్న ప్రణబ్ ముఖర్జీని వ్యతిరేకించారు. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపి ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్ కలాం, మన్మోహన్ సింగ్, సోమనాథ్ ఛటర్జీల పేర్లను సూచించారు. ఆ తర్వాత 42 గంటల లోపే తన మనసు మార్చుకున్నారు. టీఎంసీ అధినేత మమతా బెనర్జీని కాదని ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వానికి మద్దతు చెప్పారు. ఓటింగ్ సందర్భంగా తొలుత పీఏ సంగ్మాకు ఓటేసి…ఆ తర్వాత కొత్త బ్యాలెట్ పేపర్ తీసుకొని ప్రణబ్ కు ఓటేశారు.

ఈ ఒక్క సంఘటనే కాదు…జాతీయ రాజకీయాలపై ఎక్కువ ఆసక్తి చూపించే ములాయం…సార్వత్రిక ఎన్నికల ముందు థర్డ్ ఫ్రంట్ అంటూ హడావుడి చేశారు. కాంగ్రెస్, బీజేపీయేతర కూటమిని ఏర్పాటు కోసం ఒకానొక సమయంలో వామపక్షాలు, పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరిపారు. అయితే థర్డ్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్ధికి హెవీ కాంపిటీషన్ ఉండటంతో వెనక్కు తగ్గారు. ఆ సమయంలో ములాయం ఎత్తులు ఫలిస్తే..ధర్డ్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్ధిగా ములాయం రంగంలోకి దిగేవారు.

కేంద్రంలో బీజేపీ-కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నప్పుడు…ములాయం వ్యూహాలకు టైమ్ పట్టేది. కానీ, పరిస్థితి మారింది. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యం నెరవేరే వాతావరణం ఏర్పడింది. దాంతో జనతా పరివార్ అంటూ రెండు దశాబ్దాల వైరం ఉన్న పలు ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చారు. అక్కడ కూడా తానే పెద్దన్నగా నిలిచారు. కానీ ఇంకా ఏదో లోటు కనిపించింది. అందుకే పార్లమెంట్ లో కూడా తానే చక్రం తిప్పాలనుకున్న ములాయం…పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరోసారి తన వ్యూహాలకు పదును పెట్టారు. ఇంకా నాలుగు రోజుల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగుస్తాయనగా…ప్లేటు ఫిరాయించారు. కాంగ్రెస్ కనుసన్నల్లో మెలగడం ఏ మాత్రం ఇష్టంలేని ములాయం ఉన్నట్లుండి…యూ టర్న్ తీసుకున్నారు. అందుకే, పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగిస్తూ…తప్పు చేస్తున్నామని, అయిందేదో అయిపోయింది..ఇకనైనా తాము చర్చకు సహకరిస్తామన్నారు. ఇంకేముంది అప్పటిదాకా ములాయం మనవెంటే ఉన్నారనుకున్న కాంగ్రెస్ ఖంగుతింది. ములాయం సింగ్ యాదవ్ వైఖరి మారడంపై ప్రధాని మోడీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అయితే..కాంగ్రెస్ ను ఎదిరించి చర్చకు సిద్ధమవుతున్నందుకు ములాయం ను ప్రశంసించారు. మోడీ అలా ప్రశంసించి కొద్ది గంటలయ్యిందో లేదో…మళ్లీ మనసు మార్చుకున్నారు. ఉభయసభల్లో కాంగ్రెస్ ఆందోళన చేస్తుంటే…సమాజ్ వాదీ పార్టీ సభ్యులు కూడా వాళ్లతో చేరి పోడియం దాకా దూసుకుపోయారు. మరి, మారిన వ్యూహానికి ఏదో ఒక కారణం చూపాలి కదా! అందుకే, కులగణన వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తూ…సభలో ఆందోళన కొనసాగించినట్లు ప్రకటించారు..

రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన ఘటంగా పేరొందిన ములాయం ..ఎప్పటికి ఏం తోస్తే, అలా చేస్తూ.. ఎప్పటికీ ఎవరికీ అంతుబట్టకుండా.. తాను సమ్ థింగ్ స్పెషల్ అని నిరూపించుకుంటూనే ఉన్నారు.