రాజధానిపై ఇక అడుగు పడాలి

`గురువారం 3`3`2022
రాజధాని అమరావతి విషయంలో గత మూడేళ్ల వైసిపి పాలనలో ఒక్క ఇటుక కూడా వేయలేదు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అభివృద్ది 30 ఏళ్లు వెనక్కి పోయింది. చేతికి ఎముక లేదన్నట్లుగా జగన్‌ డబ్బుల పందేరంతో ఓటు బ్యాంకును సృష్టించుకునే ప్రయత్నంలో అభివృద్దిని విస్మరించారు. చంద్రబాబును విమర్శించడం, విపక్ష నేతలపై కేసులు పెట్టడం ద్వారా జగన్‌ పురోగమించ లేకపోయారు. తండ్రి వైఎస్‌లో ఉన్న హుందాను కూడా పుణికి పుచ్చుకోలేక పోయారు. అలాగే రాజధాని లేకుండా మూడేళ్ల పాటు లాక్కు వచ్చారు. ఇంతకన్నా చరిత్రలో అద్భుతం ఉండదు. విభజన తరవాత ఎపికి ఉన్న వనరుల దృష్ట్యా ఎంతో అభివృద్దికి అవకాశం ఉన్నా..సిఎం జగన్‌ వాటిని కాలరాసారు. ఉన్న అవకాశాలను ఉపయోగించుకోలేదు. ఇప్పటికైనా అమరావతిని కొననసాగించి తోణఱ కార్యక్రమాలు చేపట్టాలి. హైకోర్టు తీర్పును స్వాగతించాలి. ప్రభుత్వానికి దూరదృష్టి లేదనడానికి ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. తాజాగా హైకోర్టు తీర్పు జగన్‌ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. అలాగే మూడు రాజధానుల పాట పాడుతున్న మంత్రులకు ,ఎమ్మెల్యేలకు గుణపాఠం కావాలి. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో దీనిపై సమగ్ర చర్చ చేసి కనీసం ఈ రెండేళ్ల యినా ప్రజా సంక్షేమం కోరి పాలన చేయాలి. సీఆర్‌డీఏ చట్ట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి. మూడునెలల్లో ప్లాన్‌ను పూర్తిచేయాలని, ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని, 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి పరిచిన ప్లాట్లు ఇవ్వాలంది. అభివృద్ధి పనుల పై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని, రాజధాని అవసరాలకు తప్ప ఇతర అవసరాలకు భూమి తనఖాకు వీల్లేదని కోర్టు వెల్లడిరచింది. రాజధానులు, సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై హైకోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని, 3 నెలల్లోపు వాటాదారులకు ప్లాట్లు నిర్ణయించాలంది. 6 నెలల్లోపు ప్లాట్లకు మౌలిక సదుపాయాలు పూర్తిచేయాలి. ఉన్నది ఉన్నట్లుగా మాస్టర్‌ప్లాన్‌ ప్రకారం అభివృద్ధి చేయాలంది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని పేర్కొంది. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇకపోతే మరో శుభవార్త ఏంటంటే రాజధాని కోసం కేంద్రం కూడా బడ్జెట్‌లో నిదులు కేటాయించింది. ఒకరోజు ముందు ఈ వార్త రాగానే హైకోర్టు తీర్పు కూడా వచ్చింది. ఈ క్రమంలో జగన్‌ పట్టుదలకు పోకుండా ప్రజలకోసం పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో సచివాలయ నిర్మాణానికి కేంద్రం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. రూ.1214.19 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం మొదలుపెట్టిన కేంద్రీయ సచివాలయం కోసం ఈ కేటాయింపులు చేసింది. నిజానికి… జగన్‌ సర్కారు అమరావతిని ఎప్పుడో అటకెక్కించింది. మధ్యలో మూడు రాజధానులను తీసుకొచ్చింది. న్యాయ వివాదాల నేపథ్యంలో… మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని అధికారికంగా అమరావతే నని కేంద్రం కూడా గుర్తించింది. అలాగే… అమరావతి లో రూ.6.69 కోట్ల వ్యయంతో జనరల్‌ పూల్‌ ఆఫీస్‌ అకామిడేషన్‌ కోసం భూమి కొనుగోలుకు కూడా కేంద్రం నిధులు కేటాయించింది. దీని కోసం గత ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రభుత్వం రూ. 4.48 కోట్లను వెచ్చించింది. రూ. 1126.55 కోట్ల వ్యయంతో నిర్మించాల్సిన జనరల్‌ పూల్‌ రెసిడెన్షియల్‌ క్వార్టర్ల కు సైతం రూ.లక్ష కేటాయించడం గమనార్హం. దీనికి సంబంధించి భూ కొనుగోలుకు ఇప్పటి వరకు కేంద్రం రూ. 18.03 కోట్లు ఖర్చు చేసింది. అకౌంటెంట్‌ జనరల్‌ సిబ్బంది నివాస భవనాల నిర్మాణానికీ కూడా నిధులు
కేటాయించింది. విజయవాడ, విశాఖపట్నం లో హాలిడే హోమ్‌ నిర్మాణానికి, విశాఖలో 806 జీపీఆర్‌ఏ నివాసాల నిర్మాణానికి, అందుకు భూములు కొనుగోలుకు, విజయవాడలో సీజీవో కాంప్లెక్స్‌ నిర్మాణానికి నామమాత్రంగా రూ.లక్ష చొప్పున కేంద్రం కేటాయించింది. ఈ క్రమంలో ఇంతకాలంగా గందరగోళం తొలగడం లేదు. అమరావతి అక్కడే ఉంటుందా లేకపోతే తరలిస్తున్నారా? మరోచోట దీని నిర్మాణం చేస్తారా అన్నది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నుంచి మూడేళ్లుగా ఎలాంటి సంకేతాలు రాలేదు. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నరీతిలో మూడు రాజధానులు అంటూ చిచ్చు రేపారు. అమరావతి ముంపు ప్రాంతం కనుక, ఇక్కడ పెద్దగా కట్టడాలు ఏవిూ లేవు కనుక, టిడిపి పార్టీ వారి భూములే ఉన్నాయి కనుక అంటూ.. దీరాలు తీస్తూ సమస్యను రాజేసారు. అయితే దీనిపై ఇంతగా గందగోళం చెలరేగడానికి కారణం నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదే తప్పు. అయోమయ పరిస్థితిని సృష్టించి రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడడం సరికాదు. మంత్రులు, అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలతో రాష్ట్ర ప్రజల్లోనూ, భూములిచ్చిన రైతుల్లోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. రాజధానిని నాలుగుచోట్ల చేయాలని మరికొందరు తెరపైకి వచ్చారు. మొత్తంగా గందరగోళానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఐదువేల ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చని 2015 మార్చిలో అమరావతి పర్యటనకు వచ్చిన సమయంలో అప్పటి ప్రతిపక్షనేతగా జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. రాజధానిలో ఇన్‌సైడ్‌ ట్రేడిరగ్‌ జరిగిందని, టిడిపిలో ఉన్న పెద్దలకు లబ్ది కలిగించే విధంగా వ్యవహరించారని, దీనిపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ప్రకటించిన విషయం విదితమే. ఇప్పటి వరకూ రాజధాని అమరావతిలో సుమారు 23 వేల కోట్ల రూపాయల విలువ చేసే పనులు వివిధ దశల్లో వున్నాయి. అమరావతి పరిధిలో టిడిపి నేతలు, ఆ పార్టీ అనుయాయులు కొందరు అప్పట్లో వందల ఎకరాల భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు కూడా అధికార పార్టీవారు చేస్తూ వచ్చారు. కానీ ఏదీ నిరూపించ లేక పోయారు. పరిపాలనా కేంద్రమైన రాజధాని విషయంలో అస్పష్టత ఎప్పటికీ మంచిది కాదు. దీంతో పెట్టుబడి పెట్టాలనుకున్న వారు వెనక్కి పోయారు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళానికి తెరదించుతూ ప్రభుత్వ వైఖరిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటనే స్పష్టం చెయ్యాలి. హైకోర్టు తీర్పు మేరకు నడుచుకోవాలి. నాయకుడిగా జగన్‌ ఉన్నత విలువలు నెలకొల్పాలి. అలాగే కేంద్రంతో పోరాడి విభజన సమస్యలను సాధించాలి.