రాజధానిలో పట్టపగలే భారీ దోపిడీ

కారును ఆపి తుపాకులతో బెదిరింపు

వ్యాపారి నుంచి 70 లక్షలు చోరీ

న్యూఢిల్లీ,ఆగస్ట్‌4(జ‌నం సాక్షి): దేశరాజధానిలో భారీ దోపిడి జరిగింది. రద్దీగా ఉండే ఫ్లైఓల్గ/వర్‌పై అందరూ చూస్తుండగానే కొందరు దుండగులు ఓ వ్యాపారిని తుపాకీతో బెదిరించి.. అతని వద్ద నుంచి రూ. 70లక్షలు ఎత్తుకెళ్లారు. గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..దిల్లీకి చెందిన కాశిష్‌ బన్సాల్‌ గత గురువారం తన ఇంటి నుంచి కారులో గురుగ్రామ్‌ బయల్దేరారు. నరైనా ప్రాంతంలో ఫ్లై ఓల్గ/వర్‌పై వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి బన్సాల్‌ కారును ఆపారు. దీంతో కారు వెనుక సీట్లో కూర్చున్న బన్సాల్‌ దిగేందుకు ప్రయత్నించగా.. నిందుతుల్లో ఒకడు తుపాకీతో ఆయనను బెదిరించాడు. అనంతరం మిగతా ఇద్దరు నిందితులు కారు డిక్కీలోని రూ. 70లక్షలతో ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. ఫ్లై ఓవర్‌ మధ్యలో అందరూ చూస్తుండగానే దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. అటుగా వెళ్తున్న వారు తమ వాహనాలను ఆపి నిందితులను ఆపే ప్రయత్నం చేయాలనుకున్నప్పటికీ వారి చేతిలో తుపాకీ ఉండటాన్ని గమనించి వెనుకడుగు వేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు బహుశా వ్యాపారికి తెలిసిన వ్యక్తులే అయి ఉంటారని, డబ్బుతో వస్తున్నట్లు తెలుసుకుని దోపిడీ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.