రాజన్న ధర్మగుండానికి మోక్షమెప్పుడు ?

vemulawada templeఆధునీకీరణకు నోచుకోని వేములవాడ ఆలయ పుష్కరిణి – అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి ప్రతీకగా మారిన ధర్మగుండం

– కలుషితమైన నీటిలోనే భక్తుల స్నానాలు – పూడిక తీసి రెండు నెలలైనా నీరులేని ధర్మగుండం

– కొబ్బరి ముక్కల వేలం పేరుతో ధర్మగుండం కాంట్రాక్టు – కాంట్రాక్టు షరతులను ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్‌

– ఏ ఆలయ పుష్కరిణిలోనూ కానరాని ధర్మగుండం వేలం పాటలు

వేములవాడ, మే 29 (జనంసాక్షి) :

రాష్ట్రంలోని ఏ పుణ్యక్షేత్రంలోనూ లేని సాంప్రదాయాన్ని వేములవాడ దేవస్థానం వారు ఇక్కడి పవిత్ర ధర్మగుండంలో అమలుచేస్తూ, భక్తుల నుండి తీవ్రమైన నిరసనను ఎదుర్కుంటున్నారు. ఏ దేవాలయంలోనూ లేని పుష్కరిణి వేలం పాటలను వేములవాడలో నిర్వహిస్తుండడం వల్ల  ప్రతి ఏటా దేవస్థానానికి లక్షలాది రూపాయల ఆదాయం లభిస్తోంది. అయితే ధర్మగుండం ద్వారా లక్షలాది ఆదాయం సమకూరుతున్నప్పటికీ దీనిని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో వారి నిర్లక్ష్యానికి ప్రతీకగా నీరు కలుషితమవుతూ, నెలల తరబడి దుర్గంధభూయిష్టంగా మారుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామికి తమ మొక్కుబడులు తీర్చుకోవడానికి  విచ్చేసే లక్షలాది భక్తులు ముందుగా ధర్మగుండంలో స్నానాలు చేసి తడిబట్టలతో కోడె మొక్కులు చెల్లించుకుని తమ ఇలవేల్పయిన రాజన్నను సందర్శించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. ధర్మగుండంలో స్నానాలు చేస్తే తమ బాధలు, కష్టాలు తీరతాయన్న నమ్మకంతో కుటుంబ సమేతంగా  ఇందులో భక్తులు మునకలు వేస్తారు. అలాగే కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు జంటగా కొంగు ముళ్లు వేసుకుని సరిగంగ స్నానాలంటూ అయ్యవార్లతో మంత్రాలు చెప్పించుకొని మరీ జంటగా స్నానాలు చేయడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. కాగా పాపాలు, బాధలు, కష్టాలు తీరడమేమో గానీ, గుండం వద్దకు వచ్చే భక్తులు దుర్వాసన వెదజల్లుతున్న ధర్మగుండంలోకి దిగాలంటేనే జంకుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ మచ్చుకైనా కనబడని ధర్మగుండం నీళ్లపై భక్తులు వేసిన కొబ్బరి ముక్కలు ఓ వైపు జాలీలపై తేలియాడుతుండగా  మరోవైపు మురికినీటి కుంటలా మారి, దుర్గంధం వెదజల్లే నీళ్లలో బతుకు జీవుడా అనుకుంటూ భయం, భక్తితో మునిగి తేలుతున్నారు. కాగా ధర్మగుండం పరిశుభ్రతకు, నీరు కలుషితం కాకుండా తగిన క్లోరినేషన్‌ చేయడం కానీ, నీటిని ఎప్పటి కప్పుడు మార్చడంలాంటి కనీస చర్యలు తీసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీళ్లన్నీ అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతున్నాయి.

రాజన్న ధర్మ గుండానికి మోక్షమెప్పుడు?

కాంట్రాక్టు షరతులను యథేేచ్ఛగా ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్‌-తెలిసీ, తెలియనట్లు నటిస్తున్న ఆలయ అధికారులు :

రాజన్న ధర్మగుండంలో స్నానాలాచరించే భక్తులు కొబ్బరి కాయలు కొట్టడమే కాకుండా చిల్లర నాణాలు వేస్తుంటారు. గతంలోభక్తులు వేసిన నాణాలను ధర్మగుండంలో నీటిని తీసినపుడు ఆలయ సిబ్బందే ఏరి ఖజానాకు జమచేసేవారు. కాగా ధర్మగుండంలో భక్తులు కొట్టే కొబ్బరికాయ ముక్కలను ఏరుకోవడానికి గాను గత కొన్ని సంవత్సరాలుగా దేవస్థానం వారు వేలం పాటలు నిర్వహిస్తున్నారు. అయితే వేలం నిబంధనల ప్రకారం కేవలం భక్తులు కొట్టిన కొబ్బరి ముక్కలను మాత్రమే ఏరుకోవడానికి కాంట్రాక్టు ఒప్పందముండగా దీనికి విరుద్ధంగా కొబ్బరి ముక్కలతో పాటు డబ్బులను కూడా  ఏరుతూ కాంట్రాక్టు షరతులను, నిబంధనలను ఉల్లంఘిస్తున్నా ఆలయానికి ఆదాయం వస్తుందన్న నెపంతో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి రెండు సంవత్సరాలకోసారి కొబ్బరి ముక్కలు ఏరుకోవడానికి నిర్వహించే ఈ వేలం పాటల ద్వారా  నాలుగు సంవత్సరాల క్రితం దేవస్థానానికి  సుమారు 4.5 లక్షల ఆదాయం రాగా గత  2010 మార్చిలో నిర్వహించిన వేలం పాటలో ఆలయానికి 61 లక్షలకు పైగా ఆదాయం లభించింది.

ఆదాయమున్నా నీటి పరిశుభ్రతపై అధికారుల నిర్లక్ష్యం:

రాజన్న ధర్మగుండంలో కొబ్బరిముక్కలు, ఇతరత్రా కారణాల వల్ల నీరు కలుషితంగా మారి భక్తులకు ఇబ్బందులేర్పడుతున్నా ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పవిత్ర ధర్మగుండంలో నీళ్ళన్నీ దుర్వాసన వెదజల్లుతూ, భక్తుల అనారోగ్యానికి హేతువుగా మారుతున్నాయి. కాగా భక్తులు ఈ గుండంలో ఊరికే స్నానాలు చేయకుండా దేవస్థానానికి లక్షలాది ఆదాయం కట్టబెడుతున్నా అధికారులు భక్తుల ఇబ్బందులను పట్టించుకోకుండా ఆలయానికి కోట్లాది ఆదాయం ఎలా రాబట్టాలన్న విషయంపైనే  పది రోజులకోసారి సమావేశాలు నిర్వహిస్తున్నారని, ధర్మగుండం పవిత్రతపై తమ మనోభావాలను దెబ్బతీస్తూ, లక్షలాది భక్తుల కిలవేల్పయిన రాజన్న ప్రతిష్టను మంటగలుపుతున్నారని మండిపడుతున్నారు.

– రెండు నెలలైనా ధర్మగుండంలో నీరు నింపని అధికారులు :

మహాశివరాత్రి, శ్రీరామనవమి తదితర ఉత్సవాలతో పాటు ప్రతి సోమ, శుక్రవారాల్లో లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేసే క్రమంలో రాజన్న క్షేత్రంలో మహిమాన్వితమైనదిగా భావించే పవిత్ర ధర్మగుండంలో నెలల తరబడి నీళ్ళు తీయకపోవడంతో దుర్గంధ భూయిష్టంగా మారుతోంది. ఈ విషయంపై భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నోమార్లు ఆలయ ఈ.ఓ.ను కలసి తమ నిరసనను తెలిపినప్పటికీ నిర్లక్ష్యం వహించడంతో నెలల తరబడి భక్తులు ఈ మురికినీటిలోనే తమ స్నానాలాచరించారు. చివరకు కరీంనగర్‌ ఎం.పి. పొన్నం ప్రభాకర్‌ నీటి దుర్వాసనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు గత ఎప్రిల్‌ మొదటివారంలో ధర్మగుండంలోని మురికి నీటిని తొలగించారు. అలాగే ధర్మగుండం ఆధునీకరణపై త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని ఈ.ఓ. హామీ ఇచ్చి  రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, అలాగే ఇటు ధర్మగుండంలో నీటిని నింపడానికి ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో భక్తులు ఆలయ అధికారుల నిర్లక్ష్యంపై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

భక్తుడ్ని చితకబాదిన ధర్మగుండం కాంట్రాక్టర్‌:

రాజన్న ధర్మగుండంలో  మంగళవారం రోజున సిరిసిల్లాకు చెందిన విశ్వనాథ్‌ అనే యువకుడు చిల్లర నాణాలు ఏరుతుండడంతో  కాంట్రాక్టర్‌కు సంబంధించిన వ్యక్తులు ఆ భక్తునిపై దాడి చేసి తీవ్రంగా చితకబాదారు. కాగా ఈ సంఘటనను చూసిన ఆలయ పోలీస్‌ సిబ్బంది భక్తునితో పాటు దాడి చేసిన వ్యక్తులను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దాడిపై కాంట్రాక్టరును వివరణ కోరగా ధర్మగుండంలో డబ్బులేరుకుంటున్న వ్యక్త్తిని తామే కొట్టామని జంకూ గొంకూ లేకుండా బదులిచ్చారు. కాగా ధర్మగుండంలో భక్తులు వేసిన డబ్బులను తీయడానికి కాంట్రాక్టు షరతుల ప్రకారం ఎలాంటి హక్కులేని కాంట్రాక్టర్‌ కూలీలను పెట్టి అందులోనుండి డబ్బులు ఏరడం, అలాగే మంగళవారం ఓ వ్యక్తి తీసిన చిల్లర నాణాల విషయంపై అతన్ని తన మనుషులతో కొట్టించడం చర్చనీయాంశంగా మారింది.

తాజావార్తలు