రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురేస్తాం

160 స్థానాల్లో గెలవబోతున్నాం

కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ శుక్లా ఆశాభావం

జయపుర,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని, 160 స్థానాలు తమకే దక్కుతాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ శుక్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ‘అభిప్రాయ సేకరణలో మాకు అందుతున్న సమాచారం ప్రకారం రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా కనీసం 160 స్థానాల్లో గెలుస్తుంది. సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గదు’ అని శుక్లా జయపురలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ఇప్పుడు వాగ్దానాలు చేయడంలో భాజపా ఆరితేరిందని శుక్లా దుయ్యబట్టారు. రాజస్థాన్‌లో భాజపా ప్రభుత్వం ఇచ్చిన హావిూల్లో కేవలం పది శాతం కూడా నెరవేర్చలేదని విమర్శించారు. ప్రకటనలు, ¬ర్డింగ్‌లు, బ్యానర్లతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రం రూ.3లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. భాజపా అవినీతి నిర్మూలిస్తామని చెప్తోంది.. కానీ వాళ్ల హయాంలో మైనింగ్‌, ఇసుక, ఎల్‌ఈడీ లైట్లు.. తదితర వ్యవహారాల్లో కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. కేంద్రం రఫేల్‌ యుద్ధ విమానాల ధరల వివరాలు వెల్లడించడం లేదని శుక్లా విమర్శించారు. సీఎం అభ్యర్థి గురించి ప్రశ్నించగా.. తాము కలిసికట్టుగా పోటీ చేస్తామని ప్రజల తీర్పు ప్రకారం ఎమ్మెల్యేలు వారి నేతను ఎన్నుకుంటారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయగలదు.. కానీ పొత్తుల విషయంపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ నిర్ణయం తీసుకుంటుందని శుక్లా స్పష్టంచేశారు.