రాజస్థాన్‌ ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిల్‌

ప్రభుత్వ తీరును తప్పుపట్టిన కాంగ్రెస్‌

జయపుర,అక్టోబర్‌ 23(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. సీఎం వసుంధర రాజే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ ఆర్డినెన్స్‌ అధికారులు, ప్రజాప్రతినిధులను నేరాలకు పాల్పడమని లైసెన్సు ఇచ్చినట్లు ఉందని పిటిషన్‌దారుడు ఆరోపించారు. ఈ వివాదాస్పద బిల్లును వెంటనే రద్దు చేయాలంటూ కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆందోళన చేపట్టింది. అవినీతిపరులను రక్షించేందుకే దీనిని తీసుకొచ్చారంటూ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలెట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఈ ఆర్డినెన్స్‌కు కేంద్ర మంత్రి పి.పి.చౌదరి మద్దతు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి చట్టం అవసరం చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులపై అవినీతి ఆరోపణలకు సంబంధించిన విచారణ జరిపేందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలంటూ రాజస్థాన్‌ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. సెప్టెంబరు 7న ఈ ఆర్డినెన్స్‌ను జారీ చేశారు. దీని ప్రకారం అధికారులు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసులు వేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. దానికి సంబంధించిన వార్తలను విూడియాలో

ప్రసారం చేసిన పాత్రికేయులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. నిబంధనలను అతిక్రమించిన విూడియా యాజమాన్యాలు, పాత్రికేయులకు రెండు సంవత్సరాల పాటు జైలు శిక్షను విధించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ఆర్డినెన్స్‌ను రాహుల్‌ తీవ్రంగా తప్పు పట్టారు. ఇది పూర్వకాలం కాదని, ఆధునిక కాలమని గుర్తుంచుకోవాలని సిఎం వసుందరకు సూచించారు. ఈ కాలంలో ఇలాంటి చట్టాలను ప్రజలు హర్షించరని అన్నారు.