రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
రాజ్యసభ ముందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు (Women’s Reservation Bill ) గురువారం ఉదయం రాజ్యసభ (Rajya Sabha) ముందుకు చేరింది. సభ ప్రారంభంకాగానే కేంద్ర న్యాయశాఖ మంత్రి (Union Law Minister) అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) మహిళా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో చర్చ చేపట్టారు. చర్చ అనంతరం బిల్లుపై ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే, ఈ బిల్లుకు విపక్ష సభ్యులు మద్దతు తెలుపుతుండటంతో ఎగువ సభలో బిల్లు ఆమోదం పొందడం లాంఛనంగా కనిపిస్తోంది. ఉభయ సభల ఆమోదం అనంతరం రాష్ట్రపతి ముద్రతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, నియోజకవర్గాల పునర్విభజన పూర్తైన తర్వాతే ఈ బిల్లు అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది.
మరోవైపు ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈనెల 19వ తేదీన మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీనిపై 20వ తేదీన అంటే బుధవారం చర్చ జరిగింది. అదే రోజు ఓటింగ్ నిర్వహించారు. మొత్తం 456 మంది ఎంపీల్లో 454 మంది అనుకూలంగా, ఇద్దరు ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు. బీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు రిజర్వేషన్ల బిల్లుకు అనుకూలంగా ఓటేశాయి. మహిళా సాధికారత విషయంలో అధికార, విపక్ష పార్టీలన్నీ ఏకతాటిపై నిలిచాయి. దీంతో బిల్లుకు దిగువ సభలో ఆమోద ముద్ర పడింది. కొత్త పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తొలి చారిత్రాత్మక బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచింది.