రాజ్యాంగ స్పూర్తి వల్లే దేశాభివృద్ధి

5

– గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): స్వాతంత్య్రానంతరం దేశం శక్తివంతంగా మారిందని, రాజ్యాంగంలో ఉన్న సూత్రాలకు కట్టుబడి ఉండడం వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అన్నారు. మన ఆశయాల సమగ్ర సాధనకు రాజ్యాంగం డాక్యుమెంట్‌గా నిలుస్తుందన్నారు. పటిష్టమైన రాజ్యాంగమే దీనికి ఆలంబన అన్నారు.  రాష్ట్రపతిభవన్‌లో జరిగిన గవర్నర్ల సదస్సులో గవర్నర్లను ఉద్దేశించి ప్రణబ్‌ మాట్లాడారు. గవర్నర్ల విూద రాజ్యాంగ బాధ్యతలు ఉంటాయని, ఆ బాధ్యతలు ఉన్నవాళ్లందరూ రాజ్యాంగ పవిత్రను కాపాడాలన్నారు. ఆర్థిక మందగమనం, వాతావరణ మార్పులు, భద్రత వంటి అంశాల్లో గత ఏడాది సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. సీమాంతర ఉగ్రవాదం వల్ల కొన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయన్నారు. సరిహద్దు బయట భద్రతా వాతావరణం బలహీనంగా ఉన్న కారణంగా మన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రణబ్‌ తెలిపారు. శాంతియుత చర్చల పక్రియ ద్వారా అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించాలని గవర్నర్లకు రాష్ట్రపతి సూచించారు. వరుసగా రెండు సార్లు రుతుపవనాలు దెబ్బతీశాయని, రైతులు తీవ్ర కరువుతో ఇబ్బందిపడుతున్నారని, వాళ్ల సమస్యను యుద్ధ ప్రాతిపదికను పరిష్కరించాలన్నారు. విద్యా ప్రమాణాల మెరుగు కోసం ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని రాష్ట్రపతి అన్నారు. రైతుల సంక్షేమం కోసం కేటాయించిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ను మరింత శాస్త్రీయంగా నిర్వహించాలన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాన్ని తగ్గించేందుకు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలన్నారు. నేపాల్‌ మాజీ ప్రధాని సుశీల్‌ కోయిరాలా మృతి పట్ల ప్రణబ్‌ సంతాపం తెలిపారు. కీలక దశలో ఆయన నేపాల్‌ రాజకీయాలను దిశానిర్దేశం చేశారన్నారు. భారత్‌తో సంబంధాలను బలపరిచేందుకు సుశీల్‌ కోయిరాలా నిత్యం శ్రమించారని ప్రణబ్‌ అన్నారు. సదస్సులో ప్రధాని మోడీ, ఉపరాష్ట్రపతి అన్సారీ,¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌  తెలుగు రాష్ట్రాల గవర్నర్‌  నరసింహన్‌, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య తదితరులు పాల్గొన్నారు.