రాజ్‌భవన్‌కు చేరిన తమిళనాడు రాజకీయం 

గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్షాలు

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని కోరుతూ డీఎంకే కీలక నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. శాసనసభ ప్రతిపక్ష ఉపనేత, డీఎంకే నాయకుడు దురైమురుగన్‌, కరుణానిధి తనయ, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆదివారం ఉదయం 10.30 గంటలకు చెన్నైలోని గిండిలో ఉన్న రాజ్‌భవన్‌ చేరుకున్నారు. డీఎంకే నేతలతో పాటు మిత్రపక్షాలైన కాంగ్రెస్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లినవారిలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని పేర్కొన్నారు. బలపరీక్షకు ముఖ్యమంత్రిని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం దురైమురుగన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. గవర్నర్‌ తమ వినతిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారని చెప్పారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే పరిస్థితిని గవర్నర్‌ తీసుకురారని విశ్వసిస్తున్నామన్నారు. గవర్నర్‌ చర్యలు చేపట్టకుంటే రాష్ట్రపతిని కలవాలని యోచిస్తున్నట్లు చెప్పారు.