రాధేమాకు కోర్టులో చుక్కెదురు

గృహహింస కేసునుంచి విముక్తికి తిరస్కరణ

ముంబయి,సెప్టెంబర్‌9(జ‌నంసాక్షి): వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, స్వయం ప్రకటిత దైవస్వరూపిణి రాధేమాకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులు, వేధింపులు, మతాచారాలను అగౌరవ పర్చడం తదితర ఆరోపణలకు సంబంధించి ఆమెపై కేసు నమోదుచేయాల్సిందిగా ఇటీవల పంజాబ్‌-హరియాణా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. తాజాగా తనపై నమోదైన గృహహింస కేసునుంచి తన పేరు తొలగించి, విముక్తి కల్పించాలని రాధేమా చేసుకున్న విజ్ఞప్తిని స్థానిక బోరివలి కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు న్యాయమూర్తి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. గత మంగళవారమే రాధేమా ఉదంతాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని చంఢీగఢ్‌ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మరోవైపు ఫగ్వాడా(పంజాబ్‌)కు చెందిన వీహెచ్‌పీ మాజీ నేత సురీందర్‌ మిట్టల్‌ను రాధేమా గడిచిన కొన్నేళ్లుగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాధేమా.. మొదట ప్రేమ మాటలు, తర్వాత మోహపువల, ఎంతకు తాను లొంగకపోవడంతో చివరికి చంపేస్తాంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు సురీందర్‌ పేర్కొన్నారు. పంజాబ్‌ లో తన ఆటలు సాగకపోవడంతో ఆమె ముంబయికి మాకాం మార్చారు. అయితే ముంబయిలోనూ ఆమె అక్రమాలు, అసాంఘిక కార్యకలాపాలపై బాధితులు ఫిర్యాదులు చేసారు.

సత్సంగ్‌ పేరుతో రాధేమా నగ్న పూజలు నిర్వహించేదని, భక్తులతోపాటు తాను కూడా నగ్నంగా డ్యాన్స్‌ చేసేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. డేరాబాబా తరవాత ఇప్పుడు అందరి దృష్టి రాధేమాపై పడింది.