రాబర్ట్‌ వాద్రపై విచారణ జరిపించాలి : బిజెపి డిమాండ్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 9 : రాబర్ట్‌ వాద్రపై విచారణ జరిపించాలని బిజెపి జిల్లా ఇన్‌ఛార్జి ప్రేమేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం నాడు జిల్లా కేంద్రంలో నిర్వహించిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో పీకల్లోతు మునిగిపోయిందన్నారు. రాబర్ట్‌ వాద్రపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేయగా, ప్రభుత్వం నిరాకరించడం సిగ్గుచేటని అన్నారు. జిల్లాలో చేపట్టిన సభ్యత్వ నమోదు విజయవంతమైందని, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా పార్టీ  సభ్యత్వ నమోదు జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా, మండల కమిటీల్లో దళితులకు, మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తున్నామని ప్రేమేందర్‌రెడ్డి  అన్నారు. నవంబర్‌ నెలలో జిల్లా నూతన అధ్యక్షుడిని ఎన్నుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా బిజెపి అధ్యక్షుడు గంగారెడ్డి, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ, డాక్టర్‌ బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.